అప్పుల బాధతో ఒకరు.. వడ్లు కొంటలేరని మరో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో ఒకరు.. వడ్లు కొంటలేరని మరో రైతు ఆత్మహత్య
  • జనగామ జిల్లాలో అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య
  • హనుమకొండ జిల్లాలో గుండె పోటుతో కౌలు రైతు మృతి

స్టేషన్ ఘన్‌పూర్ (జఫర్‌‌గఢ్​), భీమదేవరపల్లి, వెలుగు: రాష్ట్రంలో రైతుల మరణాలు ఆగడం లేదు. అప్పుల బాధతో ప్రతి రోజూ ఏదో ఒక చోట ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. జనగామ జిల్లాలో గురువారం రాత్రి మరో రైతు సూసైడ్ చేసుకున్నాడు. పంట సాగుకు పెట్టిన ఖర్చు, కూతురు పెళ్లి కోసం చేసిన రూ.5 లక్షల అప్పులు తీర్చే మార్గం లేక పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జఫర్‌‌గఢ్ మండలం శంకర్‌‌తండాకు చెందిన లకావత్ లాలు (50)కు ఎకరం చెల్క, రెండెకరాల పొలం ఉంది. పంటలసాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.2 లక్షలు అప్పులు తెచ్చాడు. మరో రూ.3 లక్షలు అప్పు తెచ్చి రెండేళ్ల కిందట కూతురు పెండ్లి చేశాడు. పంట దిగుబడి సరిగా రాలేదు. దీంతో రూ.5 లక్షలు అప్పులు ఎలా తీర్చాలో అని ఆవేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి 9.30కు ఇంట్లో కుటుంబ సభ్యులు పడుకున్న తర్వాత పురుగుల మందు తాగాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందాడు. శుక్రవారం ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు.. లాలును అపస్మారక స్థితిలో చూసి స్థానిక డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ చెప్పారు.

వరి కొనబోమంటున్నరని..

భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లి గ్రామానికి చెందిన నూగూరి రంగారెడ్డి (50) రెండెకరాలు కౌలుకి తీసుకుని పంట సాగు చేస్తున్నాడు. వరి వేస్తే కోనుగోలు చేయబోమనే ప్రభుత్వం తీరు సరికాదంటూ రెండు రోజులుగా ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పొలంలో పని చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు.