‘సాఫ్ట్’గా వ్యవసాయం చేస్తుండ్రు

‘సాఫ్ట్’గా వ్యవసాయం చేస్తుండ్రు

వికారాబాద్: ప్రాచీన పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడి రాబడుతున్నారు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. దేశీయ పద్ధతిలో గానుగ నూనె, వరి సాగు చేస్తూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నిరూపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కేశవరావు, కరీంనగర్ కు చెందిన సంతోష్ కుమార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. కేశవరావు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుండగా... సంతోష్ కుమార్ స్వీడన్ లో జాబ్ చేస్తున్నారు. వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తో 2018 లో వికారాబాద్ జిల్లా యాలాల మండలం విశ్వనాథ్ పూర్ గ్రామంలో వీరిద్దరూ కలిసి 10 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఎలాంటి కృత్రిమ రసాయనాలు వాడకుండా దేశీయ పద్థతిలో రకరకాల పంటలు పండిస్తున్నారు. ఈ సందర్భంగా సాఫ్ట్ వేర్ రైతులు మాట్లాడుతూ... ప్రకృతి వ్యవసాయంతో పాటు ఆరోగ్య సమాజాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని అంటున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రైతుకు పెట్టుబడి తక్కువ అవుతుందని, దేశీ విత్తనాల తయారీతో పాటు సొంతంగా ఎరువుల తయారీ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాక వినియోగదారుని వైపు నుంచి చూస్తే తనకు ఆరోగ్యవంతమైన ఆహారం అందుతుందని తెలిపారు.

రైతులను వినియోదారులను అనుసంధానం చేయడం వల్ల  ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనిని ఆచరణలోకి తీసుకురావడం కోసమే ప్రయత్నాలను మొదలుపెట్టామని అన్నారు. ప్రాచీన పద్ధతిలో పండించిన ఆహారం తినడం వల్ల అప్పటి మనుషులు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండేవారని స్పష్టం చేశారు.  వృద్ధాప్యంలో కూడా మెరుగైన కంటి చూపు, దృఢత్వం గల పంళ్లు ఉండేవని అన్నారు. గానుగ నూనెలో విటమిన్లు ఉంటాయని,ఈ నూనె వాడడం వల్ల గుండెపోటు సంబంధిత వ్యాధులు దరి చేయవు రావన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా తాము చాలా మందికి ఉపాధి కలిగిస్తున్నామని సాఫ్ట్ వేర్ రైతులు సంతోష్, కేశవరావు చెప్పారు.