జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్... ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్... ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాగా, కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నట్లు భద్రతా దళాలకు ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ఆర్మీ వెంటనే సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఇండియాలోకి అక్రమ చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం కాల్చిచంపిందని అధికారులు వెల్లడించారు.

ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఘటన స్థలంలో ఆపరేషన్ కొనసాగుతుందని.. స్పాట్‎కు అదనపు బలగాలను కూడా పంపినట్లు వెల్లడించారు అధికారులు. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు పెరిగే అవకాశం ఉందనే సమాచారం మేరకు భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో సైన్యం నిఘా పెంచింది. శీతాకాలానికి ముందు చొరబాటు ప్రయత్నాలు పెరుగుతాయని.. ఇందులో భాగంగా సరిహద్దు వెంబడి ఉన్న వివిధ లాంచ్ ప్యాడ్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టుం చేశామని అధికారులు తెలిపారు.