ఈనెల 31 నుంచి కరోనా రూల్స్​ ఎత్తివేత

ఈనెల 31 నుంచి కరోనా రూల్స్​ ఎత్తివేత

న్యూఢిల్లీ: కరోనా ఎంటరై రెండేళ్లు దాటింది. అప్పటి నుంచి ఆంక్షల మధ్యనే బతుకుతున్నది ప్రపంచం. 180 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేయడం, ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య పూర్తి తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు 1,500 దాకా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం విధించిన నిబంధనలను ఈ నెల 31 నుంచి ఎత్తివేయనున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ యాక్ట్ కూడా అమలులో ఉండదని వెల్లడించింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌‌లు, ఫిజికల్ డిస్టెన్స్‌‌ కొనసాగించాలని సూచించింది. 

రెండేళ్ల కిందట ఇదే రోజు ఆంక్షలు!

విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద 2020 మార్చి 24న కేంద్రం తొలిసారి కరోనా గైడ్‌‌లైన్స్ జారీ చేసింది. వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను అందులో వివరించింది. తర్వాత వాటిని సవరిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో బుధవారం కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా.. అన్ని రాష్ట్రాల సీఎస్‌‌లకు లెటర్లు రాశారు. ‘‘కరోనా కట్టడి చేసేందుకు గత 24 నెలలుగా రోగనిర్ధారణ, నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, చికిత్స, టీకా, ఆసుపత్రుల్లో సౌలతులు.. వంటి వివిధ అంశాల్లో మన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు సాధారణ ప్రజలకు కరోనా విషయంలో చాలా అవగాహన వచ్చింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సొంత సామర్థ్యాలను పెంచుకున్నాయి. ఏడు వారాలుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ.. కరోనా కట్టడి రూల్స్ అమలు చేయాల్సిన అవసరంలేదని, డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ యాక్ట్ నిబంధనలను అమల్లో ఉంచాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకుంది” అని వెల్లడించారు. కాగా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాత్రం.. మాస్క్‌‌లు, శానిటైజేషన్ కొనసాగించాలని సూచించింది.