పార్లమెంట్‌‌‌‌ వర్షాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లు!

పార్లమెంట్‌‌‌‌ వర్షాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లు!

న్యూఢిల్లీ: ఈ నెలలో జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో  యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు సంబంధించిన బిల్లును కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టే చాన్స్ ఉందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపి, సభ్యుల అభిప్రాయాలను తెలుసుకుంటారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై లా కమిషన్, న్యాయ శాఖ ప్రతినిధులు అభిప్రాయం తెలియజేయాలని కోరుతూ కేంద్రం జూన్ 14నే పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 3న లా కమిషన్, న్యాయ శాఖ ప్రతినిధులతో కేంద్రం సమావేశం నిర్వహించనుంది. ఈ మీటింగ్ లో సభ్యుల అభిప్రాయాలతో పాటు ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం వంటి అంశాలను చర్చించనున్నారు. పార్లమెంట్  వర్షాకాల  సెషన్‌‌‌‌  ఈ నెల మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదట పాత పార్లమెంటు భవనంలో  సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత కొత్త భవనంలో కొనసాగుతాయి.  

ఏంటీ యూసీసీ?

యూనిఫాం సివిల్  కోడ్ తో దేశమంతా ఒకే చట్టం తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. వివాహాలు, విడాకులు, దత్తత, వారసత్వం వంటి విషయాల్లో యూసీసీతో అన్ని మతాల వారికి ఒకే రకమైన నిబంధనలు రూపొందించేందుకు కృషి చేస్తున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్  44 కూడా యూసీసీ అమలు గురించి వివరిస్తుంది. దేశంలో ఒక దశాబ్దంపైగా ఈ అంశంపై చర్చ జరుగుతున్నది. తాము అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేయడానికే మొదటి ప్రాధాన్యం ఇస్తామని 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ హామీ ఇచ్చింది.