కోటక్​ మహీంద్రా బ్యాంక్​ ఎండీ, సీఈఓ పదవులకు.. ఉదయ్ కోటక్ రాజీనామా

కోటక్​ మహీంద్రా బ్యాంక్​ ఎండీ, సీఈఓ పదవులకు.. ఉదయ్ కోటక్ రాజీనామా

న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాంకర్​, కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ తన పదవులకు రాజీనామా చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఆయన రాజీనామా ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  సభ్యుల ఆమోదానికి లోబడి ఈ ఏడాది డిసెంబరు 31 వరకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా.. మేనేజింగ్ డైరెక్టర్,సీ ఈఓ  విధులను నిర్వహిస్తారని కంపెనీ తెలిపింది. 1985లో ఎన్​బీఎఫ్​సీని స్థాపించిన ఉదయ్​.. 2003 నాటికి పూర్తిస్థాయి కమర్షియల్​ బ్యాంకుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మార్కెట్​ విలువ పరంగా ఇది మూడో అతిపెద్ద బ్యాంక్​. ఎవరైనా ఒక బ్యాంకుకు సీఈఓగా 15 ఏళ్లకు మించి ఉండకూడదని ఆర్​బీఐ రూల్స్​ చెబుతున్నాయి.

నా నిర్ణయం స్వచ్ఛందమే...

ఉదయ్ కోటక్ ఈ విషయమై ఎక్స్​లో (గతంలో ట్విటర్​) స్పందించారు "కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌‌‌‌‌‌‌ వారసత్వం గురించి నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మా ఛైర్మన్, నేను,  జాయింట్ ఎండీ అందరూ సంవత్సరాంతానికి పదవీ విరమణ చేయవలసి ఉంది. కొత్త వారికి బాధ్యతలను అందించడానికి నేను తప్పుకుంటున్నాను. సీఈఓ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతున్నాను . కొత్త సీఈఓ నియామకం కోసం బ్యాంక్ ఆర్​బీఐ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. నా కొలీగ్​ - ప్రస్తుతం జాయింట్ ఎండీ దీపక్ గుప్తా ఈ సంవత్సరాంతం వరకు ఎండీ & సీఈఓగా పని చేస్తారు. బ్యాంకు ఫౌండర్​గా నాకు కోటక్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌తో చాలా అనుబంధం ఉంది. ఇక నుంచి సంస్థకు నాన్-–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​గా,  ముఖ్యమైన వాటాదారుగా సేవలను కొనసాగిస్తాను. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా వద్ద అత్యుత్తమ నిర్వహణ బృందం ఉంది. 

వ్యవస్థాపకులు వెళ్ళిపోతారు కానీ సంస్థ శాశ్వతంగా ఉంటుంది. చాలా కాలం క్రితమే జేపీ మోర్గాన్,  గోల్డ్‌‌‌‌‌‌‌‌మన్ శాక్స్ వంటి పేర్లు ఆర్థిక మార్కెట్లలో ఆధిపత్యం చెలాయించడాన్ని నేను చూశాను.  భారతదేశంలో అలాంటి సంస్థను సృష్టించాలని కలలు కన్నాను. ఈ కలతోనే నేను 38 సంవత్సరాల క్రితం కోటక్ మహీంద్రా బ్యాంకును ముంబైలో 300 చదరపు అడుగుల ఆఫీసులో ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభించాను. ఈ  ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని నేను ఎంతో ఆస్వాదించాను. నా కలను సాకారం చేసుకున్నాను. విశ్వసనీయత, పారదర్శకత అనే మూలస్తంభాలు ఆధారంగా మా సంస్థ ఏర్పడింది.  మా వాటాదారులకు మేం విలువను సృష్టించాం. లక్షకు పైగా ఉద్యోగాలను ఇచ్చాం. 1985లో మా వద్ద పెట్టిన రూ.10 వేల పెట్టుబడి ఈరోజు దాదాపు రూ. 300 కోట్లు అవుతుంది.  భారతదేశాన్ని సామాజిక  ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో కోటక్​ మహీంద్రా బ్యాంక్​ మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను” అని పేర్కొన్నారు. 

కోటక్​ నుంచి  మల్టీ అసెట్​ అలోకేషన్​ ఫండ్​

కోటక్​ మ్యూచువల్​ఫండ్​ మల్టీ అసెట్​ అలోకేషన్​ ఫండ్​ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. ఈక్విటీ,  ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలు, డెట్, మనీ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంది. ఇన్​స్ట్రమెంట్స్, కమోడిటీ ఈటీఎఫ్‌లు,  ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్‌లలోనూ మదుపు చేస్తుంది. ఈ పథకం పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఆగస్టు 31, 2023న ఓపెన్​ అయింది. ఈ నెల 14న ముగుస్తుంది. పెట్టుబడిదారులు కనీసం రూ. 5,000 మొత్తాన్ని ఇన్వెస్ట్​ చేయాలి.  సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్​) ద్వారా కనీసం రూ. 500 మదుపు చేయాలి.  ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో సంపదను సృష్టించడమే లక్ష్యంగా మల్టీ అసెట్​ అలోకేషన్​ ఫండ్​ను లాంచ్​ చేశామని సంస్థ ఎండీ నీలేశ్​ చెప్పారు.  మార్కెట్​ పరిస్థితులను బట్టి ఫండ్​ మేనేజర్​కేటాయింపులను మార్చుతారని చెప్పారు. స్కీమ్​ కార్పస్​లో 65 శాతం మొత్తం ఈక్విటీల్లో ఉంచుతామని చెప్పారు.