బాల్ ఠాక్రే పేరు వాడుకోకుండా మోడీ పేరుతో ఎన్నికలకు వెళ్లాలి: ఉద్దవ్ ఠాక్రే

బాల్ ఠాక్రే పేరు వాడుకోకుండా మోడీ పేరుతో ఎన్నికలకు వెళ్లాలి: ఉద్దవ్ ఠాక్రే

బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే మరోసారి ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం కేంద్రానికి తొత్తులా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీ గుర్తును షిండే వర్గం లాక్కుందని..శివసేన పార్టీ, గుర్తును దొంగతనం చేశారని ఆరోపించారు. తనకు ఇచ్చిన కాగడా గుర్తుతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.

2024 ఎన్నికల్లో బీజేపీ- షిండే వర్గానికి ప్రజలు ఓటు వేయొద్దని కోరారు. బాల్ ఠాక్రే పేరు వాడుకోకుండా మోడీ పేరుతో షిండే ఎన్నికలకు వెళ్లాలని ఉద్దవ్ ఠాక్రే సవాల్ విసిరారు. 

షిండే వర్గానికే విల్లు బాణం గుర్తు..

శివసేన గుర్తు, పార్టీ పేరుపై షిండే వర్గం, ఉద్ధవ్ వర్గం మధ్య వివాదం నెలకొనగా..కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీ, గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికే కేటాయించింది. విల్లు బాణం గుర్తు షిండే వర్గానిదే అని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఈసీ త్రిసభ్య కమిటీ 78 పేజీల ఆదేశాలను విడుదల చేసింది. 

2022  జూన్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాఢీ  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏక్ నాథ్ షిండే వర్గం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఆ తర్వాత  ఉద్ధవ్‌, షిండే  వర్గాల మధ్య శివసేన పేరు, పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే పేరును వాడుకోవడం, పార్టీ గుర్తు విషయంలో ఆదిపత్య పోరు మొదలైంది. తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలని.. విల్లు-బాణం గుర్తు  తమకే కేటాయించాలని కోరుతూ ఉద్ధవ్‌ ఠాక్రే ఈసీఐని ఆశ్రయించారు. దీనిపై  ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ ఏర్పాటైంది. రెండు వర్గాల వాదోపవాదాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం..షిండే వర్గానికే అసలైన శివసేన అని తేల్చింది. విల్లు బాణం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. ఇక మహారాష్ట్రలో  ఉప ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్‌ వర్గానికి బాలాసాహెబ్‌ అంచి శివసేన పార్టీ పేరును.. వెలుగుతున్న కాగడాను ఎన్నికల గుర్తుగా కేటాయించింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని  మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే స్వాగతించగా.. ఉద్ధవ్‌ వ్యతిరేకించారు. అంతేకాదు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బుధవారం ఉద్ధవ్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.