కేంద్రంపై ఆప్​ చేస్తున్న పోరు​కు మద్దతు ఇస్తాం : ఉద్ధవ్​ థాక్రే

కేంద్రంపై ఆప్​ చేస్తున్న పోరు​కు మద్దతు ఇస్తాం : ఉద్ధవ్​ థాక్రే

మేమందరమూ కలుస్తం: థాక్రే

కేంద్రంపై పోరాటంలో ఆప్​కు మద్దతిస్తమని వెల్లడి

ముంబైలో ఉద్ధవ్​ థాక్రేతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ

ముంబై : ఢిల్లీ సర్కార్ అధికారాలను లాగేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్​ను వ్యతిరేకిస్తున్నామని శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే తెలిపారు. కేంద్రంపై ఆప్​ చేస్తున్న పోరు​కు మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. ‘‘ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నోళ్లను ఓడించేందుకు మేమంతా కలుస్తం. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కలిసి వస్తం. ఇప్పుడు మేం పోరాడకపోతే దేశంలో ప్రజాస్వామ్యమే లేకుండా పోతుంది” అని అన్నారు. ప్రజాస్వామ్యానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఎంతో ముఖ్యమని చెప్పారు. బుధవారం ముంబైలో ఉద్ధవ్ థాక్రేను ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కలిశారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్​కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్రం రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడితే వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా పాల్గొన్నారు. 

బీజేపీకి కోర్టులపై నమ్మకం లేదు : కేజ్రీవాల్

మీటింగ్ తర్వాత ఉద్ధవ్, కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజలకు మద్దతుగా ఉంటామని ఉద్ధవ్ హామీ ఇచ్చారని కేజ్రీవాల్ చెప్పారు. ‘‘ఇది వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్​లా ఉంటుంది. కేంద్రం తెచ్చే బిల్లును రాజ్యసభలో అడ్డుకుంటే.. 2024లో బీజేపీ ఓడిపోతుందనే సందేశాన్ని పంపొచ్చు” అని అన్నారు. ఇది కేవలం ఢిల్లీ ప్రభుత్వం కోసం చేస్తున్న పోరు కాదని.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఫెడరలిజం కోసం చేస్తున్న పోరాటమని చెప్పారు. ‘‘ఈ ఆర్డినెన్స్​ను బట్టి కేంద్రానికి సుప్రీంకోర్టుపై నమ్మకంలేదని అర్థమవుతున్నది. తమకు వ్యతిరేకంగా తీర్పు ఎట్లా ఇస్తుందన్నట్లుగా కేంద్రం తీరు ఉన్నది” అని ఫైర్ అయ్యారు. ‘‘ఒకాయన అహంకారిగా మారారు. అహంకారిగా మారితే స్వార్థం పెరిగిపోతుంది. అహంకారి, స్వార్థపరుడు దేశాన్ని పాలించలేడు” అని మోడీని కేజ్రీవాల్ పరోక్షంగా విమర్శించారు.