
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగుల ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ పెండింగ్‌లో ఉండడంతో పాటు పైస్థాయి ఉద్యోగుల కారణంగా కిందిస్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది. అలాగే ఇతర జిల్లాల నుంచి బదిలీపై యాదాద్రికి రావడం వల్ల సొంత గ్రామాల్లో వ్యక్తిగత, భూ సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఉద్యోగులకు సెలవులు దొరకకపోవడంతో ఆ సమస్యలు పెండింగ్ పడుతుండడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు కలెక్టర్‌కు సమాచారం అందింది. దీంతో వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు అవసరమైన పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో ‘ఉద్యోగ వాణి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్న కింది స్థాయి నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకు ప్రతి గురువారం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో తనను కలిసి సమస్యలు చెప్పుకోవడం, వినితిపత్రం ఇచ్చే అవకాశాన్ని కల్పించారు. ఉన్నతాధికారుల నుంచి ఇబ్బందులు పడుతున్నట్లయితే అందుకు గల కారణాలను తెలుసుకొని వాటిని పరిష్కరించనున్నారు.
అలాగే ఉద్యోగులకు తమ సొంత గ్రామాల్లో వ్యక్తిగత, భూ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే ఆ జిల్లా ఆఫీసర్లతో కలెక్టర్ మాట్లాడి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయనున్నారు. అయితే.. ఉద్యోగవాణి కార్యక్రమానికి రావాలనుకునే ఉద్యోగులు తమ పైస్థాయి అధికారుల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.