
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. తెలుగు మాట్లాడే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. రాజ్ భవన్ లో మంగళవారం ఉగాది వేడుకలు నిర్వహించారు. పండితుడు దత్తాత్రేయ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి , హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు గవర్నర్ రాధాకృష్ణన్ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన తెలుగులో మాట్లాడారు. జోతిష్యం, పంచాంగం ఎలా ఉన్నా దృఢ సంకల్పంతో, మన మీద మనం నమ్మకం ఉంచి ముందుకెళ్లాలని సూచించారు.
పాడిపంటలతో తెలంగాణ కళకళలాడాలి
మన దేశం అన్ని రంగాల్లో స్వదేశీ ఉత్పత్తితో ముందుకు వెళ్తోందని గవర్నర్ రాధాకృష్ణన్ తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి.. పాడి పంటలతో తెలంగాణ కళకళలాడాలని, రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే నెలలో జరుగనున్న ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.