సీఎం రేవంత్​కు అంతా అనుకూలమే

సీఎం రేవంత్​కు అంతా అనుకూలమే
  • రాహుల్​ గాంధీకి ఈ ఏడాది రాజయోగం 
  • అంతా కలిసి పనిచేస్తే కాంగ్రెస్​కు కేంద్రంలో అధికారం
  • రాష్ట్రంలో ప్రతిపక్షం మరింత వీక్​ అవుతుంది
  • గాంధీ భవన్​లో ఉగాది పంచాంగ శ్రవణం

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి గత అక్టోబర్ నుంచి సింహంలా పనిచేశారని, ఈ క్రోధి నామ సంవత్సరం ఆయనకు అంతా అనుకూలంగా ఉన్నదని చిలుకూరి శ్రీనివాస మూర్తి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కష్టపడి పనిచేస్తే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు.  కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి త్వరలోనే రాజయోగం ఉన్నదని వెల్లడించారు.  కేంద్రంలో ఈ సారి సుస్థిర ప్రభుత్వం ఏర్పడనుందని తెలిపారు. ఉగాదిని పురస్కరించుకొని గాంధీభవన్​లో  పండితుడు చిలుకూరి శ్రీనివాస మూర్తి మంగళవారం పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం మరింత వీక్ అవుతుందని వెల్లడించారు.  కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులకు, రాజకీయ నాయకులకు  ప్రమాదాలు జరిగి చనిపోతారని, దీంతో వారి శాఖల్లో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. కొందరు సీనియర్ నాయకులు రాజకీయాలకు దూరమైపోతారని వెల్లడించారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వంలోని స్కామ్ లు, భూకబ్జాలు బయటపడుతాయని, కొందరు నేతలు శిక్ష అనుభవిస్తారని చెప్పారు. 

సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థలో అనుకోని మార్పులు సంభవిస్తాయని తెలిపారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు రాజకీయ నేతల కనుసన్నల్లోనే పని చేస్తాయని అన్నారు.  దేశంలో  కాశీ, కేదార్​నాథ్, ద్వారక వంటి ఆలయాలు అభివృద్ధి చెందుతాయని, కొత్త ఆలయాల నిర్మాణం జరుగుతుందన్నారు. బ్యాంకింగ్, కమ్యూనికేషన్ల వ్యవస్థలతో పాటు పలు యూనివర్సిటీల్లో పేపర్ లీక్ లు, ఇతర అవకతవకలు బయటపడుతాయని తెలిపారు. కలుషిత ఆహారంతో ప్రజలు అనారోగ్యం బారిన పడతారని, చాలా మంది కిడ్నీ సమస్యలతో సతమతమవుతారని వెల్లడించారు. ఆగస్టు, సెప్టెంబర్ లో మత ఘర్షణలు జరుగుతాయని తెలిపారు. గంజాయి, మత్తు వినియోగం పెరుగుతుందని తెలిపారు. రక్షణ శాఖ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్టీ నేతలు మహేశ్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. 

 14 నుంచి 15 సీట్లు గెలుస్తాం: మహేశ్ కుమార్ గౌడ్

 పార్లమెంట్​ ఎన్నికల్లో రాష్ట్రంలో 14  నుంచి 15 ఎంపీ సీట్లు గెలుస్తామని ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్​లో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎంగా రేవంత్ రెడ్డి వంద రోజుల పాలన బాగుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని,  రాహుల్ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తంచేశారు. 

సీఎం రేవంత్​కు కొడంగల్​వేద పండితుల ఆశీర్వచనం

కొడంగల్, వెలుగు: నూతన తెలుగు సంవత్సరం, ఉగాది పండుగ సందర్భంగా కొడంగల్​కు చెందిన వేద పండితులు సీఎం రేవంత్​రెడ్డికి ఆశీర్వచనం ఇచ్చారు. కొడంగల్​  శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన అర్చకులు, ధర్మకర్తలు మంగళవారం హైదరాబాద్​లోని సీఎం ఇంటికి వెళ్లారు. సీఎంకు శ్రీవారి ఫొటో, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.