తూర్పు ఉగాండాలోని జింజా జిల్లాకు చెందిన వృద్ధ మహిళలు క్రికెట్ ఆడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. వీళ్లు ‘క్రికెట్ గ్రానీస్’గా పాపులర్ అయ్యారు. ఒంటరితనాన్ని, మానసిక ఒత్తిడిని, వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి వీళ్లు ఈ ఆటను ఎంచుకున్నారు.
2025లో కేవలం 10 మంది బామ్మలతో మొదలైన ఈ కార్యక్రమం, ఇప్పుడు పది రెట్లు పెరిగింది. 26 ఏళ్ల కోచ్ ఆరోన్ కుసాసిరా పిల్లల కోసం ఈ ట్రైనింగ్ మొదలుపెట్టాడు. కానీ అప్పుడు చాలామంది ఆ ఆట గురించి సరైన అవగాహన లేక పిల్లల్ని పంపేవాళ్లు కాదు. దాంతో బామ్మల ఆసక్తిని చూసిన కోచ్ వాళ్లని ఇందులో భాగం చేశాడు. ఇప్పుడు అందరూ కలిసి ఆడుతున్నారు. ప్రతి శనివారం జరిగే ప్రాక్టీస్ సెషన్లు కేవలం ఆట కోసమే కాకుండా, ఒకరి కష్టసుఖాలను మరొకరు పంచుకునే వేదికగా మారాయి. దీనివల్ల తమ మనసు తేలికపడుతుందని వాళ్లు చెప్తున్నారు.
క్రికెట్ ఈ మహిళల జీవితంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది వాళ్లకు ఒక థెరపీలా పనిచేస్తోంది. ఈ జట్టులో 50 నుంచి 90 ఏళ్ల మధ్య వయసు వాళ్లున్నారు. అంతేకాదు.. వీళ్లు స్పోర్ట్స్ డ్రెస్సులకు బదులుగా తమ సంప్రదాయ పొడవాటి గౌన్లు ధరించి, చాలామంది చెప్పులు లేకుండానే మైదానంలో బ్యాట్‌తో బంతులను గాల్లో ఎంతో ఎత్తుకు ఎగిరేలా కొడుతున్నారు.
కివుంబుక గ్రామంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం, ప్రస్తుతం వందలాది మంది మహిళలకు చేరువైంది. ఇటీవల జరిగిన ఒక ఉత్సవంలో 56 మంది బామ్మలు 78 మంది పిల్లలతో కలిసి కిక్రెట్ ఆడి సందడి చేశారు. వాళ్లలో ఒకరైన 72 ఏళ్ల జెన్నిఫర్ వైబీ.. ‘‘ వ్యాయామం వల్ల వెన్ను, మోకాళ్ల నొప్పులు తగ్గాయ” చెప్పింది.
లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ
featureseditor@v6velugu.com
