
మనీ లాండరింగ్, ఫెమా చట్టం ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న లికర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో చుక్కెదురైంది. విజయ్ మాల్యాను ఇండియాకు అప్పగించాలన్న యూకే హోంమంత్రి సాజిద్ జావిద్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఏడాది పాటు ఈ కేసు కొనసాగగా.. గత డిసెంబర్‌లో నే జడ్జి ఎమ్మా ఆర్బత్నాట్ మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. ఇండియా కోర్టులకు మాల్యా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని కోర్టు తేల్చి చెప్పింది. ఇక జైలు పరిస్థితులను చూపిస్తూ తనను అప్పగించకూడదన్న మాల్యా వాదనను కూడా కొట్టిపారేసింది. అతనికి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్న భారత ప్రభుత్వ హామీకి లండన్ కోర్టు ఓకే చెప్పింది. దీంతో అతన్ని భారత్‌కు అప్పగించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది.