డ్రైవర్ల కొరతతో బ్రిటన్​ ఆగమైతంది

డ్రైవర్ల కొరతతో బ్రిటన్​ ఆగమైతంది
  • ట్రాన్స్​పోర్ట్ ​వాహనాలు ఎక్కడివక్కడే
  • పెట్రోల్​ బంకులు, సూపర్​ మార్కెట్లు ఖాళీ
  • ఆందోళనలో జనం.. మార్గాలు వెతుకుతున్న ప్రభుత్వం

లండన్: యూకేలో సరిపడా డ్రైవర్లు లేక గూడ్స్ రవాణా రంగం అతలాకుతలమైతోంది. ట్రక్ డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశంలో హెవీ గూడ్స్​వెహికిల్స్​నడిపే డ్రైవర్లు లేక రవాణా రంగంపై ఆధారపడి నడుస్తున్న ఇండస్ట్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. పెట్రోల్​బంకులకు ఫ్యూయల్​తరలించే వాహనాలకు కూడా డ్రైవర్లు లేకపోవడంతో బంకులు మూతపడుతున్నాయి. అంబులెన్స్​లు సహా వివిధ వాహనాలు ఫ్యూయల్​కోసం బంకులు వెతుక్కుంటూ తిరగాల్సి వస్తోంది. నిత్యావసర సరుకులు సహా వస్తు రవాణాపై చాలా ప్రభావం పడుతోంది. సూపర్​ మార్కెట్లు ఖాళీ అవుతున్నాయి. ఆందోళనతో జనం ఎక్కువ మొత్తంలో కొనుక్కుని తీసుకెళ్తున్నరు. ఈ సమస్య నుంచి గట్టెక్కడమే లక్ష్యంగా వివిధ దేశాల నుంచి డ్రైవర్లను రిక్రూట్ ​చేసుకునేందుకు ప్రభుత్వం టెంపరరీ వీసా స్కీం తీసుకురావడంపై దృష్టి పెట్టింది. వీసా నిబంధనలు సడలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

కొరత ఎందుకంటే..

దేశంలో ఒక్కసారిగా ట్రక్​డ్రైవర్ల కొరత ఎందుకు వచ్చిందనే దానిపై స్పష్టమైన కారణం తెలియడం లేదు. కరోనా పాండమిక్​ సహా ఏజ్​ ఫ్యాక్టర్​తో డ్రైవర్ల కొరత తీవ్రమైందని యూకే గవర్నమెంట్​ చెబుతుండగా, బ్రెగ్జిట్​తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్​రూల్స్​వల్లే డ్రైవర్ల కొరత ఏర్పడిందని పలు ట్రాన్స్​పోర్ట్​ సంస్థల మేనేజ్​మెంట్లు ఆరోపిస్తున్నాయి. ఈ రూల్స్​ప్రకారం.. యూరోపియన్​యూనియన్​పౌరులు బ్రిటన్‌‌‌‌లో వీసా లేకుండా పనిచేయలేరు. ఇమ్మిగ్రేషన్ రూల్స్ సడలించాలని, అలా చేస్తే యూరోప్​ అంతటా డ్రైవర్లను సులభంగా రిక్రూట్​ చేసుకోవచ్చని ట్రక్​కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఫ్యూయల్​పై ఆంక్షలు..

ఫ్యూయల్ ​సరఫరాకు ట్రక్​డ్రైవర్ల కొరత నెలకొనడంతో ఆయా సంస్థలు గ్యాస్​ స్టేషన్లను మూసివేస్తున్నాయి. యూకేలో 400 గ్యాస్​స్టేషన్లు నడిపే ఈజీ గ్రూప్​గ్యాస్​ కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టింది. ఒక్కో వ్యక్తి 30 పౌండ్లకు మించి గ్యాస్ కొనకూడదనే ఆంక్షలు పెట్టింది. ‘దేశంలో ఫ్యూయల్​ నిల్వల కొరత లేదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్నట్లే బ్రిటన్​లోనూ డ్రైవర్ల టెంపరరీ కొరతతో ఇబ్బందులు పడుతున్నం’ అని ప్రభుత్వం తెలిపింది. కానీ డ్రైవర్ల కొరతకు బ్రెగ్జిట్​ప్యాక్టర్ కూడా కారణమని ప్రభుత్వం ఎక్కడా చెప్పడం లేదు. డ్రైవర్ల కొరతను బ్రిటన్​పరిశ్రమల సమాఖ్య అధినేత ‘బ్రెగ్జిట్​హ్యాంగోవర్​’గా పేర్కొన్నాడు.