రష్యా సోల్జర్లు నన్ను చంపబోయిన్రు

రష్యా సోల్జర్లు నన్ను చంపబోయిన్రు
  • పారాచూట్​లతో వచ్చి దాడికి దిగారు: జెలెన్​ స్కీ 
  •  గార్డులు, సిబ్బంది వాళ్లను తరిమికొట్టారన్న ఉక్రెయిన్​ ప్రధాని
  • భార్య, పిల్లలతో కలిసి అధ్యక్ష భవనంలోనే ఉన్నట్లు వెల్లడి

కీవ్/మాస్కో:   యుద్ధం మొదలైనరోజే తనను, తన కుటుంబాన్ని హత్య చేసేందుకు రష్యా ప్రయత్నించగా.. తమ గార్డులు, సిబ్బంది తిప్పికొట్టారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ప్రకటించారు. పారాచూట్ లతో కీవ్ లో దిగిన రెండు రష్యన్ హిట్ స్క్వాడ్స్ టీమ్ లు తనను చంపేందుకు లేదా బందీగా పట్టుకునేందుకు రెండు సార్లు ప్రయత్నించగా.. అధ్యక్ష భవనంలోని గార్డులు, సాధారణ సిబ్బందిలో ప్రతి ఒక్కరూ తుపాకులు చేత పట్టి వారిని తరిమేశారని వెల్లడించారు. తనను హత్య చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని గతంలోనే చెప్పిన జెలెన్ స్కీ.. అధ్యక్ష భవనంపై దాడికి దిగిన విషయాన్ని మాత్రం తొలిసారిగా గురువారం రాత్రి రోజువారీ వీడియో స్పీచ్ లో బయటపెట్టారు. ‘‘రష్యన్ స్క్వాడ్ లు పారాచూట్​లతో వచ్చి కీవ్ లో దిగాయి. రెండు సార్లు అధ్యక్ష భవనంపై దాడికి దిగారు. కొన్ని నిమిషాల్లోనే నన్ను చంపేంత దగ్గరగా వచ్చారు. గార్డులతో పాటూ సాధారణ పౌర సిబ్బంది అందరికీ ఆటోమేటిక్ రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చాం. తలుపులు, కిటికీలు అన్నీ మూసేశాం. నా భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నేను అధ్యక్ష భవనంలోనే ఉన్నాను. చివరకు గార్డులు, పౌర సిబ్బంది అంతా కలిసి రష్యన్ స్క్వాడ్స్​ను తరిమేసి మమ్మల్ని కాపాడారు” అని జెలెన్ స్కీ వివరించారు. అధ్యక్ష భవనంపై రష్యన్ టీమ్​లు దాడి చేసిన గంట తర్వాతే.. తాను బయటకు వచ్చి యుద్ధానికి సంబంధించి తొలి వీడియో స్పీచ్ ఇచ్చానని తెలిపారు. దేశం విడిచి పారిపోయేందుకు సాయం చేస్తామన్న పశ్చిమ దేశాల ఆఫర్ ను తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

గుటెరస్ ఉన్నప్పుడే కీవ్​లో మిసైళ్ల వర్షం 

ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలను సైతం రష్యా అవమానిస్తోందని, గురువారం కీవ్​లో యూఎన్ చీఫ్​ఆంటోనియో గుటెరస్ ఉన్నప్పుడే క్షిపణుల వర్షం కురిపించిందని ఉక్రెయిన్ మండిపడింది. కీవ్​లో గుటెరస్​తో తాను భేటీ అయిన గంట సేపటికే ఈ దాడులు జరిగాయని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ గురువారం రాత్రి ఓ వీడియో స్పీచ్ లో వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థల పట్ల రష్యా నిజమైన వైఖరి ఎలా ఉందో ఈ దాడులే చెబుతున్నాయని అన్నారు. గురువారం కీవ్​పై క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ కూడా శుక్రవారం అంగీకరించింది.

‘ఘోస్ట్ ఆఫ్​ కీవ్’ చనిపోయిండు

యుద్ధంలో రష్యాకు చెందిన 40 యుద్ధ విమానాలను కూల్చేసిన ఫైటర్ పైలెట్ ‘ఘోస్ట్ ఆఫ్​కీవ్’ మేజర్ స్టెపాన్ తరాబాల్కా(29) మృతి చెందాడని ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. మార్చి 13న జరిగిన భీకర పోరులో ఆయన నడుపుతున్న మిగ్ 29 జెట్​ను తమ యుద్ధ విమానాలతో చుట్టుముట్టిన రష్యన్ పైలెట్లు కూల్చేశారని వెల్లడించింది. యుద్ధం మొదలైనరోజే 6 రష్యన్ విమానాలను కూల్చేసిన వీరుడని కొనియాడింది. అయితే, అసలు ఘోస్ట్  ఆఫ్ కీవ్ అంటూ ఎవరూలేరని.. యుద్ధంలో తన సోల్జర్లకు ధైర్యం చెప్పేందుకే ఉక్రెయిన్ ఈ కట్టుకథ అల్లిందనే వాదనలూ వినిపించాయి. ఘోస్ట్ ఆఫ్ కీవ్ పేరుతో విడుదలచేసిన వీడియో ఓ వీడియో గేమ్​లోనిదన్న విమర్శలూ వచ్చాయి. కానీ ఘోస్ట్ ఆఫ్​ కీవ్ ఇతనేనని, యుద్ధంలో అమరుడయ్యాడని తాజాగా ఉక్రెయిన్ ప్రకటించింది. 

రష్యన్లను అడ్డుకునేందుకు..ఊరినే వరదలతో ముంచెత్తిన్రు 

రష్యా సేనలపై పోరాటానికి తుపాకులు పట్టిన ఉక్రెయిన్ ప్రజలు.. తమ గ్రామాలు, పట్టణాల మీదుగా వెళ్లే బ్రిడ్జిలు, రోడ్లను ధ్వంసం చేస్తూ రష్యన్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కీవ్ వైపు వెళ్లే మార్గంలో ఉన్న దిమిదివ్ అనే గ్రామ ప్రజలు దగ్గరలోని దినిప్రో నది నుంచి భారీ మోటార్లతో నీళ్లను తోడి ఇట్లా తమ గ్రామా న్నే ముంచేసుకున్నరు. ‘వరదలతో ఆ రూట్ చెరువులా మారింది. దీంతో కీవ్ వైపు వెళ్లాల్సిన రష్యన్ యుద్ధట్యాంకులు అక్కడే ఆగినయ్​. కీవ్​ను కాపాడేందుకు మా వంతు పోరాటం చేశాం’ అని వారు గర్వంగా చెప్పుకుంటున్రు.