యుద్ధం మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది

యుద్ధం మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది
  • మరింత మంది ఆకలికి బలయ్యే అవకాశం

న్యూఢిల్లీ: రష్యా‌‌–ఉక్రెయిన్​ యుద్ధం ఈ రెండు దేశాలనే కాదు ప్రపంచమంతటిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఆహారం కొరత ముంచుకొస్తోంది. ధరల దడ ఇంకా పెరుగుతోంది. యుద్ధం మొదలైన వెంటనే చమురు ధరలు దూసుకెళ్లాయి. అన్ని దేశాల ఎకానమీలపైనా భారం ఎక్కువయింది.  రష్యా, ఉక్రెయిన్​ రైతులు భారీ ఎత్తున పండించిన గోధుమ, బార్లీ, మొక్కజొన్న పంటలు గ్లోబల్​ మార్కెట్లోకి రావడం లేదు. కొన్ని దేశాలు గోధుమల కోసం పూర్తిగా ఈ దేశాలపైనే ఆధారపడుతున్నాయి. ఇప్పుడు అవి ఇతర మార్కెట్ల కోసం వెతుక్కుంటున్నాయి.

ప్రపంచంలో ఎరువులను అత్యధికంగా తయారు చేసే దేశాల్లో రష్యా, బెలారస్​లు కూడా ఉంటాయి. ఇవి కూడా బయటి మార్కెట్లకు అందడం లేదు. దీంతో అన్ని మార్కెట్లలో ఎరువులు, ఆహారం ధరలు చుక్కలంటుతున్నాయి. దాడి మొదలైనప్పటి నుంచి గోధుమ ధరలు 21 శాతం వరకు, బార్లీ ధరలు 33 శాతం, ఎరువుల ధరలు 40 శాతం పెరిగాయి.  చమురు, గ్యాస్, అల్యూమినియం, నికెల్, పల్లాడియం వంటి లోహాల ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఇతర వస్తువుల ధరలూ అధికమవుతున్నాయి.

కరోనా వల్ల ఇది వరకే ధరలు విపరీతంగా పెరిగాయి. షిప్పింగ్, సప్లై​ ఇబ్బందులు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఇవి చాలవన్నట్టు చాలా చోట్ల కరువులు, వరదలు, అగ్నిప్రమాదాల వంటివి జరిగాయి. వీటన్నింటి వల్ల ప్రపంచానికి చాలా ప్రమాదాలు ఉన్నాయని, ఎన్నో దేశాలు ఆకలి రక్కసికి బలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సేవాసంస్థలు, ఎకానమిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇది వరకే ఉన్న ఆపద తీవ్రతను యుద్ధం మరింత పెంచిందని వరల్డ్​ ఫుడ్​ ప్రోగ్రామ్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ డేవిడ్​ బీస్లీ అన్నారు. 
ఏ దేశంలో చూసినా ఇబ్బందులే..
యుద్ధం ఫలితంగా ఉక్రేనియన్ రైతులు ఈసారి  పంటలను సాగుచేయలేకపోతున్నారు. అధిక ఇంధన ధరల కారణంగా యూరోపియన్ ఎరువుల ప్లాంట్లు  ఉత్పత్తిని విపరీతంగా తగ్గించాయి. బ్రెజిల్ నుండి టెక్సాస్ వరకు రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించుకుంటున్నారు. దీంతో పంటల విస్తీర్ణం పడిపోతోంది. తీవ్రమైన వరదల తర్వాత ఎన్నడూ లేనంత  గోధుమ కొరతను ఎదుర్కొంటున్న చైనా, వీటిని ఎక్కువ మొత్తం కొనుగోలు చేయాలని భావిస్తోంది. మనదేశం సాధారణంగా తక్కువగానే గోధుమలను ఎగుమతి చేస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే వీటికి విదేశీ డిమాండ్ ఇప్పటికే మూడు రెట్లు పెరిగింది. ఇది వరకే ప్రపంచవ్యాప్తంగా  కిరాణా బిల్లులు ఎక్కువ అయ్యాయి. అమెరికాలో ఫిబ్రవరిలో కిరాణా వస్తువులు ధరలు ఇప్పటికే 8.6 శాతం పెరిగాయి.

అక్కడి ప్రభుత్వ డేటా ప్రకారం ఇది 40 సంవత్సరాలలో అతిపెద్ద పెరుగుదల. ప్రస్తుత క్రైసిస్​ ధరలను మరింత పెంచుతుందని ఎకానమిస్టులు భావిస్తున్నారు. శ్రీలంక వంటి దేశాల్లో రూ.వంద పెట్టినా కిలో గోధుమ పిండి దొరకని పరిస్థితి ఉంది. లీటరు పెట్రోల్​ కోసం జనం గంటల కొద్దీ క్యూల్లో నిలుచుకుంటున్నారు. పేద అరబ్​, ఆఫ్రికన్​ దేశాల పరిస్థితి దయనీయంగా ఉంది.  

పేదల పరిస్థితి పెనం నుంచి పొయ్యిల్లో పడ్డట్టుగా మారింది.   కరోనా  సమయంలో ఆకలి బాధితుల సంఖ్య 18 శాతం పెరిగి 72 కోట్ల మంది నుండి 81.1 కోట్ల మందికి చేరింది. యుద్ధం వల్ల ప్రపంచ ఆహార మార్కెట్‌ దెబ్బతింటుందని, అదనంగా 7.6 మిలియన్ల నుండి 13.1 మిలియన్ల మంది ఆకలితో అలమటించవచ్చని ఐరాస పేర్కొంది.  ప్రపంచ ఆహార కార్యక్రమం ఖర్చులు ఇప్పటికే నెలకు  71 మిలియన్​ డాలర్లు పెరిగాయి.