ఇరాన్‌లో ఘోర విమాన ప్రమాదం..

ఇరాన్‌లో ఘోర విమాన ప్రమాదం..

ఇరాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉక్రేయిన్‌కు చెందిన బోయింగ్ విమానం టెహ్రాన్‌లో కూలింది. ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఇరాన్‌లోని ఇమామ్ ఖొమేని విమానాశ్రయం నుండి బయలుదేరిన కాసేపటికే సాంకేతిక సమస్యల కారణంగా కుప్పకూలిందని తెలుస్తుంది. ఆ సమయంలో విమానంలో 167 మంది ప్రయాణికులు మరియు 9 మంది సిబ్బందితో సహా 176 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇరాక్‌లో ఉన్నఅమెరికా సైనిక మరియు సంకీర్ణ దళాల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులు జరిగిన కొన్ని గంటలకే విమానం ప్రమాదం జరగడంతో అందరూ అమెరికాపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ జనరల్ ఖాసేమ్ సోలైమాని హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తుంది.

ఇరాన్ క్షిపణి దాడుల తరువాత ట్రంప్ ‘ఆల్ ఈజ్ వెల్’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రపంచంలో ఎక్కడాలేని అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలు తమ దగ్గర ఉన్నాయని, అంతేకాకుండా భారీగా సైనికదళం కూడా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.  క్షిపణి దాడులకు సంబంధించి ఆయన రేపు ఉదయం ఒక ప్రకటన చేస్తానని తెలిపారు. ఇరాన్ క్షిపణి దాడుల గురించి అధ్యక్షుడు ట్రంప్‌కు వివరించినట్లు, ప్రస్తుత పరిస్థితిని ఆయన పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇరాక్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది.