అవార్డులు మీకు.. అప్పులు మాకా? అంటూ ఫైర్

అవార్డులు మీకు.. అప్పులు మాకా? అంటూ ఫైర్

నిర్మల్, వెలుగు: రాష్ట్ర సర్కారుకు మూడు రోజుల టైం ఇస్తున్నామని, ఈలోగా బకాయిలు చెల్లించాలని, లేదంటే మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేస్తామని నిర్మల్ జిల్లాలోని 396 మంది సర్పంచులు అల్టిమేటం ఇచ్చారు. ఆఫీసర్ల ఒత్తిడితో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నదని సర్పంచులు వాపోయారు. తెచ్చిన అప్పులకు మిత్తీలు పెరిగిపోతున్నాయని, భార్యల మెడల్లోని పుస్తెల తాళ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

పంచాయతీల నిర్వహణ కోసం నెలనెలా ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఇవ్వడం లేదని, కేంద్రం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా మళ్లించారని మండిపడ్డారు. జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్‌‌‌‌లోని ఐబీలో పలువురు సర్పంచులు సమావేశమై, సమస్యలపై చర్చించారు. తర్వాత జిల్లా సర్పంచుల సంఘం ఇన్‌‌చార్జ్ లు వినోద్ కుమార్, వీరేశ్, అచ్యుతరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. అధికారుల ఒత్తిళ్లతో తాము లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలు, విలేజ్ పార్కులు, పంట కల్లాలు, సీసీరోడ్లు నిర్మించామన్నారు. తాము గ్రామాల్లో చేపట్టిన ఈ అభివృద్ధి పనుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవార్డులు వచ్చాయని, తమకు మాత్రం అప్పులు మిగిలిపోయాయని చెప్పారు. మిత్తిలు పెరిగిపోతున్నాయని, అప్పుల వాళ్ల వేధింపులు తట్టుకోలేక తమ భార్యల మెడల్లోని పుస్తెల తాళ్లు అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 9 నెలలుగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు రావడం లేదని, ఇటీవల వచ్చిన సెంట్రల్ ఫండ్స్​ను మళ్లించారని, దీంతో ట్రాక్టర్ల ఈఎంఐలు కట్టలేకపోతున్నామని, స్ట్రీట్ లైట్లు, పారిశుద్ధ్య నిర్వహణ కూడా చేయలేక ప్రజల్లో పలుచన అవుతున్నామని వాపోయారు. ప్రభుత్వం మొదటినుంచీ సర్పంచులపై  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు.

గ్రామాల్లో తిరగలేకున్నం

అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు.. సర్కారు నుంచి బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుల వేధింపులతో గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉంది. మేము చేసిన అభివృద్ధి పనుల వల్లే రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది. గ్రామాల్లో సీసీ రోడ్ల పనులు చేసి ఏడాది కావస్తున్నా బిల్లులు చెల్లించలేదు. అన్ని ఫండ్స్​పై ఫ్రీజింగ్ అమలు చేస్తున్నారు. బిల్లులన్నిటిని వెంటనే విడుదల చేయాలి. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తం. 
- వీరేశం, సర్పంచ్, దిలావర్ పూర్

4 నుంచి ఆందోళనలు

సర్కారుకు మూడ్రోజుల గడువు ఇస్తున్నాం. జనవరి 3లోగా మేము చేసిన సీసీ రోడ్ల బిల్లులు చెల్లించాలి. లేకపోతే 4 వ తేదీ నుంచి ఆందోళనలను ఉధృతం చేస్తాం. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులపై ఫ్రీజింగ్ అమలు చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వంపై నమ్మకంతో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశాం. మేము చేసిన అభివృద్ధి పనుల వల్లే  ప్రభుత్వానికి కేంద్ర అవార్డులు వచ్చాయి. కానీ మాకు నిధులు మాత్రం విడుదల చేయలేదు.
- వినోద్ కుమార్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు