ఐశ్వర్య రాయ్‌పై అబ్దుల్ రజాక్ అనుచిత వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన ఉమర్ గుల్

ఐశ్వర్య రాయ్‌పై అబ్దుల్ రజాక్ అనుచిత వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన ఉమర్ గుల్

భారత నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ని కించపరుస్తూ పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత దేశంలోనూ అతని మాటలను కొందరు అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో పక్కనే ఉండి అతని వ్యాఖ్యలను సమర్ధిస్తూ చప్పట్లు కొట్టిన ఆ దేశ మాజీ క్రికెటర్లు షాహీద్ ఆఫ్రిదీ, ఉమర్ గుల్‌కు నిరసన సెగ ఎదురవుతోంది. ఈ  క్రమంలో అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలను తాను సమర్ధించలేదని ఉమర్ గుల్ వివరణ ఇచ్చాడు.

అబ్దుల్ రజాక్ ఏమన్నాడంటే..?

కరాచీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అబ్దుల్ రజాక్.. పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనను ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌తో పోలుస్తూ కించపరిచేలా వ్యాఖ్యానించాడు. ప్రస్తుత పాక్ జట్టులో విబేధాలు ఉన్నట్లు చెప్పిన అతడు, ఎవరికి వారు అన్నట్లుగా ఆడితే మెరుగైన ప్రదర్శన సాధ్యమవ్వదని మాట్లాడాడు. అందుకు ఉదాహరణగా ఐశ్వర్య రాయ్‌ ప్రస్తావన తీసుకొచ్చి పిచ్చి వాగుడు వాగాడు. 

ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచిదే.. కానీ, పవిత్రమైన పిల్లలు పుట్టాలని కోరుకోవడం తప్పు అవుతుంది. అది ఎప్పటికీ జరగదు.. అంటూ మతిలేని వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో పక్కనే కూర్చొని ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్లు షాహీద్ ఆఫ్రిదీ, ఉమర్ గుల్.. అతని వాగుడును సమర్ధిస్తూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ ఘటనపై జర్నలిస్టు బాసిత్ సుభానీ.. సోషల్ మీడియా వేదికగా రజాక్, అఫ్రిది, గుల్‌లపై విరుచుకుపడ్డారు. అబ్దుల్ రజాక్ మాటలు ఐశ్వర్య రాయ్‌ని, బచ్చన్ కుటుంబాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న  కోట్లాది మంది వారి అభిమానులను బాధిస్తున్నాయి.. అని ట్వీట్ చేశారు. అందుకు బదులిచ్చిన గుల్ తాను అమాయకుడిని అని నమ్మించే ప్రయత్నం చేశాడు. 

"ఎంతటి విలువలేని మాటలు.. అందుకే విద్య, వస్త్రధారణ ముఖ్యం. ఈ ముగ్గురూ ప్రపంచంలోని నలుమూలలా పర్యటించారు. అబ్దుల్ రజాక్ చెప్తుంటే.. ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిదీ ఆ వ్యాఖ్యలను ఆమోదించారు. వీరు ఎంత తక్కువ స్థాయి వారో ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ మాటలు ఐశ్వర్య రాయ్‌ని, బచ్చన్ కుటుంబాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న  కోట్లాది మంది వారి అభిమానులను బాధిస్తున్నాయి.. " అని బాసిత్ ట్విట్టర్(ఎక్స్‌)లో రాశారు. 

అందుకుగుల్ బదులిస్తూ.. "ఆఫ్రిది భాయ్, నేను అబ్దుల్ రజాక్ చెప్పినదాన్ని ఆమోదించడానికి చప్పట్లు కొట్టలేదు. ఆ వ్యాఖ్యలు చాలా వ్యంగ్యంగా ఉన్నాయి. ఇలా మాట్లాడటం నైతికంగా ముమ్మాటికి తప్పే. ఎవరి ఆలోచనలు వారివి. ప్రతి ఒక్కరికి భిన్నమైన శైలి ఉంటుంది. కాకపోతే సంబంధం లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం ఎల్లప్పుడూ తప్పే.." అని గుల్ ట్వీట్ రాశారు. ఈ  వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వెంటనే అబ్దుల్ రజాక్ బేషరతుగా ఐశ్వర్య రాయ్‌కి క్షమాపణలు చెప్పాలని సినీ, క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.