Umran Malik:156 కి.మీ వేగంతో బుల్లెట్ బంతులు

Umran Malik:156 కి.మీ వేగంతో  బుల్లెట్ బంతులు


టీమిండియా స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్ దూకుడుకు సాటెవ్వడు.  అడ్డెవ్వడు. అతని బుల్లెట్ బంతులను అడ్డుకునేదెవ్వడు. ఐపీఎల్ లో దుమ్మురేపి టీమిండియా తలుపు తట్టిన ఉమ్రాన్ మాలిక్..అంతర్జాతీయ వేదికపై కూడా రెచ్చిపోతున్నాడు. వేగంతో బ్యాట్స్ మన్ ను ఆగమాగం చేసే ఉమ్రాన్..ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. తాజాగా లంకతో జరిగిన తొలి వన్డేలో అరుదైన రికార్డు సృష్టించాడు. 


గౌహతి వేదికగా లంకతో జరిగిన ఫస్ట్ వన్డేలో  ఉమ్రాన్ మాలిక్ 156 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరాడు.  లంక ఇన్నింగ్స్ 14వ ఓవర్ లోనాలుగో బంతి  వేగం స్పీడో మీటర్ లో  గంటకు  156 కి.మీ.ల వేగంతో వచ్చింది. దీంతో టీమిండియా తరపున అత్యధిక వేగంతో బంతి విసిరిన మూడో బౌలర్ ఉమ్రాన్ రికార్డులకెక్కాడు. భారత్ తరఫున  అత్యధిక వేగంతో బంతులు సంధించిన  జాబితాలో టెస్టుల్లో  డేవిడ్ జాన్సన్ 1996లో  ఆస్ట్రేలియాపై 157.8 కి.మీ  వేగంతో బంతిని విసిరాడు. ఇక వన్డేలలో జవగల్ శ్రీనాథ్ 1997లో జింబాబ్వేపై  గంటకు 157 కి.మీ. వేగంతో బాల్ వేశాడు.  ఆ తర్వాత  156 కి.మీతో ఉమ్రాన్ మాలిక్ నిలిచాడు. అటు టీ20ల్లో మాత్రం 155 కి.మీతో ఉమ్రాన్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లోనూ భారత్ తరఫున ఉమ్రాన్ మాలిక్ అత్యధిక వేగంతో (157 కి.మీతో  బంతిని విసిరాడు.