ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై దాడులు పెరిగినయ్ :​ యూఎన్

ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై దాడులు పెరిగినయ్ :​ యూఎన్
  • యునైటెడ్​ నేషన్స్​ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ వెల్లడి
  • పార్టనర్లు, కుటుంబ సభ్యులే హత్య చేస్తున్నరు..
  • ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని కామెంట్
  • కలిసికట్టుగా అంతం చేద్దామని ప్రపంచ దేశాలకు పిలుపు

యునైటెడ్ నేషన్స్ : ప్రపంచవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై లైంగికదాడులు, హత్యలు పెరుగుతున్నాయి. ఢిల్లీలో శ్రద్ధ వాకర్​ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో యునైటెడ్​ నేషన్స్​ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ 11 నిమిషాలకోసారి మహిళ లేదా బాలిక హత్యకు గురవుతోందని తెలిపారు. వారి పార్టనర్లు లేదా కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. నవంబర్​ 25న జరుపుకునే ‘అంతర్జాతీయ మహిళలపై హింస–నిర్మూలన దినోత్సవం’ ముందు గుటెర్రస్​ ఈ కామెంట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. మహిళలు లేదా పిల్లలపై దాడి, హత్య అనేది మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయని చెప్పారు. నేషనల్ యాక్షన్​ ప్లాన్​ను పక్కాగా అమలు చేయాలని ప్రపంచ దేశాలకు సూచించారు.

2026 నాటికి 50శాతం నిధులు పెంచాలె

లైంగిక, భౌతిక దాడులను అడ్డుకోవడానికి ఇదే సరైన టైమని ఆంటోనియో గుటెర్రస్​ నొక్కి చెప్పారు. ఇకపై దాడులు, హింస అనేవి చరిత్రగానే మిగిలిపోవాలని సూచించారు. ఈ విపత్తును పరిష్కరించేందుకు ప్రతీ దేశం జాతీయ కార్యాచరణ ప్రణాళికల తయారీ, అమలు, నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలని సూచించా రు. ప్రతీ దశలో అట్టడుగు వర్గాలు, సివిల్​ సొసైటీ గ్రూప్​లు ఇన్వాల్వ్​ అయ్యేలా చూడాలన్నారు. అప్పుడే బాధితులకు సరైన న్యాయం లభిస్తుందని వివరించారు. 2026, నాటికి మహిళా హక్కుల సంస్థలకు, ఉద్యమాలకు 50% నిధులను పెంచాలని పిలుపునిచ్చారు. మహిళా హక్కులకు మద్దతుగా నిలవాలని, పురుషాధిక్యతను తిరస్కరించేలా అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. ఈ ఏడాది ‘అంతర్జాతీయ మహిళలపై హింస-నిర్మూలన దినోత్సవం’ థీమ్ ‘యునైట్​: మహిళలు, బాలికపై హింసను అంతం చేయడానికి క్రియాశీలం కావాలి’ అని గుటెర్రస్​ ప్రకటించారు.

వివక్ష, హింస పెరిగినయ్..

కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక సంక్షోభం దాకా ప్రతీ ఒక్కరు అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. ఈ ప్రభావంతో మహిళలపై భౌతిక దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలు, పిల్లలు.. లైంగిక వేధింపులు, ఫొటోల ద్వారా బెదిరింపు లు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆన్​లైన్​ వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఇవన్నీ వారి స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను హరిస్తున్నాయన్నారు. పక్షపాతం, హింస, వివక్ష, వంటివి పెరిగిపోయాయని తెలిపారు.