
- రూ.50లక్షలు కేటాయింపులకే పరిమితం
- లీకేజీ సమస్యలను పట్టించుకుంటలేరు
హనుమకొండ, వరంగల్ సిటీ, వెలుగు: డివిజన్లలో అభివృద్ధి పనులకు బిల్లులు రావడం లేదని, జనాల్లోకి వెళ్లలేకపోతున్నామని అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు కౌన్సిల్ మీటింగ్ లో ఆవే దన వ్యక్తం చేశారు. శనివారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ మీటింగ్ జరుగగా కార్పొరేటర్లు తమ సమస్యలను వెళ్లగక్కారు. కాంట్రాక్టర్లు కొన్ని చోట్ల రేటు గిట్టడం లేదంటూ పనులు చేయడం లేదని, వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. గత మీటింగ్‌లో కే టాయించిన రూ.50లక్షలు మాటలకే పరిమితమైందని, చాలా చోట్ల టెండర్లు కూడా పిలవడం లేదన్నారు. కాగా, గతంలో తీర్మానించిన పనులే ఇంకా స్టార్ట్ కాకపోవడంతో ఏ పనులనూ ఆమోదించకుండానే సమావేశాన్ని ముగించారు. కేవ లం అన్నపూర్ణ పథకం కింద భోజనం అందిం చేందుకు రూ.1.65 కోట్లు కేటాయిస్తూ తీర్మానించారు.
కుక్కలు, కోతులు దాడులు చేస్తున్నయ్..
కార్పొరేషన్ పరిధిలో కుక్కలు, కోతులు, పందులు దాడులు చేస్తున్నాయని, దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. వాటి నియంత్రణకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. శానిటేషన్ ట్రాక్టర్లు శిథిలావస్థకు చేరాయని, దీంతో డివిజన్లలో చెత్త పేరుకుపోతోందన్నారు. శానిటేషన్ సిబ్బంది కొరత వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. శానిటేషన్ సిబ్బందిని పెంచాలని, కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని 59 డివిజన్ కార్పొరేటర్ గుజ్జుల వసంత అన్నారు.
లీకేజీలను పట్టించుకుంటలేరు..
సిటీలో మంచినీటి సరఫరా, మిషన్ భగీరథ పథకంపై మీటింగ్ లో చర్చ జరిగింది. డివిజన్లలో చాలాచోట్ల పైపులైన్లీకేజీలు ఉన్నాయని, వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు కార్పొరేటర్లు ఆరోపించారు. స్ట్రీట్‌లైట్స్, డ్రైనేజీలు, ఇంటర్నల్ రోడ్లు సరిగ్గా లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. నర్సరీల్లో ఒక్క పూల మొక్క కూడా పెంచకుండానే నిధులు మింగేశారని, దీనిపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విలీన గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పొరేటర్ రవి నాయక్
విజ్ఞప్తి చేశారు. కాగా, సమస్యలపై చర్చించేందుకు నిర్వహించే మీటింగుల పేరున గ్రేటర్ఆఫీసర్లు నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, మీటింగ్ జరిగిన ప్రతిసారి రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని పలువురు ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఫండ్స్ కొరత ఉందంటూనే పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడమేంటని విమర్శలు వ్యక్తమయ్యాయి.
సమస్యలు పరిష్కరిస్తాం..
కాంట్రాక్టర్లకు బిల్లుల విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని మేయర్ గుండు సుధారాణి హామీ ఇచ్చారు. సిటీలో వాటర్ లీకేజీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కుక్కలు, కోతులు, పందుల బెడదను అరికడతామన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్-2023 పోటీల్లో వరంగల్‌కు మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ విభాగాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర లీడర్లు గ్రేటర్ కౌన్సిల్ మీటింగ్ లకు హాజరు కాకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.