ఏపీ జల దోపిడీ: ఆగని ఆంధ్రా బనకచర్ల వ్యూహాలు

ఏపీ జల దోపిడీ: ఆగని ఆంధ్రా బనకచర్ల వ్యూహాలు

హైదరాబాద్, వెలుగు: గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే వరద జలాల పేరిట 200 టీఎంసీలను తరలించేందుకు ఏపీ  ‘పోలవరం–బనకచర్ల’ లింక్ ప్రాజెక్టును తలపెట్టింది. కేంద్ర పర్యావరణ శాఖ ఈ ప్రాజెక్టు ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’ను వెనక్కి పంపినా, సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వకపోయినా.. చంద్రబాబు మాత్రం వెనక్కి తగ్గకుండా పావులు కదుపుతున్నారు. ఒకవైపు రూ.81,800 కోట్ల బనకచర్ల ప్రాజెక్టులో మొదటి దశను రూ.58,700 కోట్ల వ్యయంతో ‘పోలవరం–నల్లమల సాగర్’గా పేరు మార్చి బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా మళ్లింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

మరోవైపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి అనుమతుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ఈ నెల12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ పార్ట్​నర్‌ షిప్ సదస్సు–2026 వేదికపైనా చంద్రబాబు మళ్లీ ‘బనకచర్ల’ అజెండాను బలంగా వినిపించారు. దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తాం. 

గోదావరి–కావేరి నదుల అనుసంధానం ఒక్కటే పెండింగ్‌లో ఉంది. పోలవరం నుంచి బనకచర్ల మీదుగా గోదావరి–కావేరి అనుసంధానం పూర్తయితే 5 నదులు, 4 రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఉండవు, ప్రధాని మోదీ మాత్రమే దీన్ని చేయగలరు’’ అని వ్యాఖ్యానించారు. ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అదే సీఐఐ సదస్సులో పోలవరం బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రాధాన్యమని తేల్చి చెప్పడాన్ని బట్టి అక్కడి ప్రభుత్వం ఎంత సీరియస్​గా ఉందో అర్థంచేసుకోవచ్చు.