
నల్గొండ అర్బన్, వెలుగు : మామ హత్య కేసులో కోడలు, ప్రియుడికి జీవిత ఖైదు, రూ.4 వేల జరిమానా విధిస్తూ నల్గొండ మహిళా కోర్టు జడ్జి కవిత శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన బొబ్బిలి పద్మ, అదే గ్రామానికి చెందిన ఆవుల వేణుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
2017 ఆగస్టు 3న ఇంట్లో ఎవరూ లేనప్పుడు పద్మ, వేణు కలిసి ఉన్నారు. ఆ సమయంలో పొలం నుంచి ఇంటికి వచ్చిన ఆమె మామ బొబ్బిలి భిక్షమయ్య చూశాడు. దీంతో ఈ విషయం భర్తకు చెబుతాడని ఆమె తన ప్రియుడితో కలిసి మామను హత్య చేసింది. మద్యం తాగి కింద పడి తలకు దెబ్బ తగిలి చనిపోయాడని తన భర్త లింగయ్యకు పద్మ చెప్పింది. పోస్టుమార్టంలో కొట్టి హత్య చేశారని తేలింది.
దీంతో నిందితులపై నకిరేకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. సాక్షులను విచారించి నిందితులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించిన పోలీస్ అధికారులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.