ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

గ్రేటర్​పరిధిలోని కరీమాబాద్ పెద్ద డివిజన్ గేటు అవతల వైపు ఉండే ప్రజలు కాలినడకన హంటర్​రోడ్డు మీదుగా సిటీలోకి వస్తుంటారు. ఈ మార్గంలో ఉన్న బ్రిడ్జి కిందకు చిన్నపాటి వర్షానికే నీరు చేరుతుంది. దాదాపు మోకాలి లోతు నీటిలోనే జనాలు నడుచుకుంటూ ఇవతలి వైపు రావాల్సి ఉంటుంది. వరద నీరు చేరినప్పుడు అధికారులు తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వరద నీరు చేరినప్పుడు ప్రజలు ఇలా గోడ ఎక్కి ప్రమాదకర పరిస్థితిలో రైల్వేలైన్లు దాటి వెళ్తున్నారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, వరంగల్

ఇంట్లోకి రాకుండా  భార్య, కొడుకును గెంటేసిన భర్త

నర్సంపేట, వెలుగు: భార్యతో పాటు రెండేళ్ల కొడుకును ఇంట్లోకి రాకుండా ఓ భర్త గెంటేశాడు. బాధితురాలి కథనం ప్రకారం.. నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చెందిన దిడ్డి రాజశేఖర్​ హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్. అతనికి అదే విలేజ్​కు చెందిన రవళితో మూడేళ్ల కింద పెండ్లయింది. వీరికి రెండేండ్ల కొడుకు ఉన్నాడు. ఏడాదిన్నర క్రితం అత్తా కోడళ్ల మధ్య వివాదాలు తలెత్తాయి. ఏడాది కింద కరోనాతో అత్త చనిపోయింది. తన తల్లి చనిపోవడానికి భార్యే కారణమని రాజశేఖర్​గొడవపడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. శుక్రవారం భర్త ఇంటికి వచ్చాడని తెలుసుకున్న రవళి తన కొడుకును తీసుకుని ఇంటికి రాగా ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. మెయిన్​ డోర్​కు తాళం వేసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఇంటి ముందే మౌన పోరాటానికి దిగింది. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, స్పాట్​కు పోలీసులను పంపించామని సీఐ పులి రమేశ్​చెప్పారు.

జెండా గద్దె కూల్చారంటూ బీజేపీ ధర్నా

మరిపెడ, వెలుగు: అనుమతులు లేవంటూ బీజేపీ జెండా గద్దెను మున్సిపల్​ఆఫీసర్లు కూల్చడంపై మరిపెడ మున్సిపల్​ఆఫీసు ఎదుట పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి... మరిపెడ మున్సిపాలిటీ ఏడో వార్డులో ఉన్న బీజేపీ జెండా గద్దెను అనుమతులు లేవంటూ గురువారం రాత్రి మున్సిపల్​ఆఫీసర్లు కూల్చారు. బీజేపీ స్టేట్ లీడర్ గాదె రాంబాబు, బీజేపీ డోర్నకల్ ఇంచార్జ్ గుగులోత్​లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. లీడర్లు మాట్లాడుతూ మరిపెడ పంచాయతీగా ఉన్నప్పటి నుంచే ఈ ప్రాంతంలో బీజేపీ గద్దె ఉందని మున్సిపల్​సిబ్బంది టీఆర్ఎస్​పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ గద్దెల ఏర్పాటకు అనుమతులు లేకున్నా పట్టించుకోని ఆఫీసర్లు.. బీజేపీ గద్దెను కూల్చడం దారుణమన్నారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు మహేశ్​గౌడ్, శ్రీనివాస్ నాయక్, సుధాకర్, జగన్, వెంకటరెడ్డి, పుల్లారెడ్డి పాల్గొన్నారు.

పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులను ప్రోత్సహించాలి

జనగామ అర్బన్​, వెలుగు:  పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులను ప్రోత్సహించాలని కలెక్టర్​ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో జిల్లా పరిశ్రమల ప్రమోషన్​ కమిటీ మీటింగ్​ జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్​మాట్లాడుతూ పరిశ్రమలను నెలకొల్పేందుకు కమిటీ కృషి చేయాలన్నారు. టీఫ్రీడ్​ పథకం కింద అప్లై చేసుకున్న ఎస్సీ, ఎస్టీ మొత్తం దరఖాస్తులకు సబ్సిడీ కోసం చర్యలు తీసుకోవాలన్నారు.  పరిశ్రమలకు ప్రాజెక్ట్​వ్యయం రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు, సేవా రంగానికి రూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచినట్లు చెప్పారు. మీటింగ్​లో డీఆర్డీవో రాంరెడ్డి, పరిశ్రమల జీఎం రమేశ్, లీడ్​ బ్యాంకు మేనేజర్​ శ్రీనివాస్​రావు, ఎస్సీ కార్పొరేషన్​ ఆఫీసర్​వెంకన్న పాల్గొన్నారు. 

ఉప ఎన్నిక వస్తేనే వరంగల్‍ తూర్పులో అభివృద్ధి  

వరంగల్‍, వెలుగు: హుజురాబాద్‍, మునుగోడు లాగా వరంగల్‍ తూర్పు నియోజకవర్గానికి ఫండ్స్​రావాలంటే అధికార టీఆర్‍ఎస్‍ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ లీడర్‍ గంట రవికుమార్‍ డిమాండ్‍ చేశారు. శుక్రవారం వరంగల్​లో ప్రెస్‍మీట్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గాల్లోనే అభివృద్ధి కనిపిస్తోందన్నారు. హుజురాబాద్‍ ఎన్నికతో దళితబంధు, మునుగోడుతో 10 లక్షల పెన్షన్లు వచ్చాయన్నారు. నరేందర్‍ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. బీసీలు ఎక్కువున్న వరంగల్‍ తూర్పు నుంచి బీసీ బంధు వచ్చే అవకాశముందని చెప్పారు. సీఎం కేసీఆర్‍ నిధుల విషయంలో హామీలు ఇచ్చుడు తప్ప అభివృద్ధికి ఫండ్స్​ఇవ్వట్లేదన్నారు. ఇప్పటివరకు నరేందర్‍ చేసిందేమీ లేదని.. చిన్నపాటి వర్షానికే నన్నపునేని సొంతగడ్డ శివనగర్‍, వరద, బురదతో నిండిపోతోందన్నారు. ఎమ్మెల్యే అభివృద్ధిని పక్కనబెట్టి తన భాషతో ఓరుగల్లు పరువు తీస్తున్నాడని మండిపడ్డారు. టీఆర్‍ఎస్‍ పార్టీకి రాజీనామా చేసిన ఎర్రబెల్లి ప్రదీప్‍రావు.. సిద్ధాంతాలు నచ్చి బీజేపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని చెప్పారు. వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యేగా పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని, వేరేవారికి అవకాశమిస్తే పార్టీ ఆదేశాల మేరకు పని చేయనున్నట్లు వెల్లడించారు.

కిడ్నీ వ్యాధి బాధితురాలికి ఎల్ఓసీ  అందజేత

జనగామ అర్బన్​, వెలుగు:  నిరుపేద కుటుంబానికి ట్రీట్​మెంట్​కోసం రూ.5లక్షల ఎల్​వోసీ మంజూరైంది. జనగామ పట్టణంలోని బాలాజీనగర్​ కు చెందిన బి.మేఘన కిడ్నీ వ్యాధితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు టీఆర్ఎస్​ రాష్ట్ర నాయకుడు నాగపూరి కిరణ్​కుమార్​ను సంప్రదించారు. విషయం తెలుసుకున్న ఆయన ప్రభుత్వం నుంచి రూ.5లక్షల ఎల్​వోసీ మంజూరు చేయించారు. సంబంధిత లెటర్​​ను శుక్రవారం బాధిత కుటుంబానికి అందజేశారు. 

అంబర్​ ప్యాకెట్ల పట్టివేత 

కాజీపేట, వెలుగు: కమలాపూర్ మండలంలోని బీంపల్లి గ్రామంలో రూ.1 లక్ష 49 వేల విలువ చేసే అంబర్​ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ వైభవ్ రఘునాథ్​గైక్వాడ్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామానికి చెందిన భూపతి హరికృష్ణ ఇంట్లో అంబర్​ ప్యాకెట్లు నిల్వ చేశాడనే సమాచారంతో దాడులు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణను విచారించగా గోదావరిఖనికి చెందిన సంతోష్ నుంచి అంబర్ ప్యాకెట్లను తెచ్చి నగరంలోని దుకాణాలకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడన్నారు. ప్రస్తుతం సంతోష్ పరారీలో ఉన్నాడని ఏడీసీపీ తెలిపారు. 

రైల్వేస్టేషన్​లో బ్యాగ్​చోరీ 

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: సోదరునికి రాఖీ కట్టేందుకు వెళుతున్న ఓ మహిళ రైలు ఎక్కుతుండగా బ్యాగ్​చోరీ అయింది. బాధితురాలి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన సుమలత వరంగల్​లో ఉన్న సోదరునికి రాఖీ కట్టేందుకు వెళ్లేందుకు మహబూబాబాద్​ రైల్వే స్టేషన్​కు చేరుకుంది. ఉదయం గోల్కొండ ఎక్స్ ప్రెస్​ఎక్కుతుండగా దొంగలు బ్యాగ్​ కొట్టేశారు. బ్యాగ్ లో తులం బంగారం, చెవి దిద్దులు, సెల్ ఫోన్, కొంత నగదు  ఉన్నట్లు బాధితురాలు తెలిపింది.  బాధితురాలు మహబూబాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిత్యం వందలాదిమంది ప్రయాణం చేసే మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో కనీసం సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్నవి పనిచేయకపోవడంతో  దొంగలు రెచ్చిపోతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 

ట్రాక్టర్​ బోల్తా పడి డ్రైవర్​ మృతి
నర్సంపేట, వెలుగు: పొలం దున్నుతుండగా ట్రాక్టర్​బోల్తా పడి డ్రైవర్​ చనిపోయాడు. వరంగల్​జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన గంగారపు రాజశేఖర్​ (42) నర్సంపేట టౌన్​లో ట్రాక్టర్​ డ్రైవర్​గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం నర్సంపేట శివారులో వరి నాటు వేసేందుకు పొలాన్ని దున్నుతుండగా ట్రాక్టర్ తిరగబడింది. ఈఘటనలో తీవ్ర గాయాలైన రాజశేఖర్​ను ఎంజీఎంకు తరలించారు. అక్కడ ట్రీట్​మెంట్​ తీసుకుంటూ చనిపోయాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

పాముకాటుతో ఒకరు మృతి

మరిపెడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన ముదిరెడ్డి ఉపేందర్(40) పొలం పనులు చేస్తూ పాము కాటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు అతడిని పీహెచ్​సీ తరలించారు. పరిస్థితి సీరియస్​ కావడంతో మహబూబాబాద్​​కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.