
బ్యాంకు ఉద్యోగి నుంచి డాన్ గా మారిన రాయ్
క్యాన్సర్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి
బెంగళూరు: అండర్ వరల్డ్ డాన్ ముతప్పా రాయ్ (68) శుక్రవారం పొద్దున చనిపోయాడు. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న రాయ్ కు రాకీ రాయ్, వికీ రాయ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. మణిపాల్ ఆస్పత్రిలో మధ్య రాత్రి 2 గంటలకు రాయ్ కన్ను మూశాడు. ఆరోగ్యం క్షీణించడంతో గత నెల 30వ తేదీన ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. రాయ్ కు క్యాన్సర్ ఉన్నట్లు 2018లో తేలింది. బిడాదిలోని తన ఇంటి వద్ద రీసెంట్ గా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాయ్ మాట్లాడుతూ తనకు బ్రెయిన్ క్యాన్సర్ ఉందని చెప్పాడు. కొంత మంది కుటుంబీకుల మధ్య రాయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పుత్తూర్ లో జన్మించిన రాయ్ కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాడు. పబ్లిక్ సెక్టార్ లోని విజయా బ్యాంక్ లో ఉద్యోగిగా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత తన భార్య రేఖతో కలసి ఓ డ్యాన్స్ క్లబ్, రెస్టారెంట్స్ బిజినెస్ లోకి దిగాడు. తర్వాత రాయ్ టీమ్ పై పుత్తూర్ లో దాడి చేశారు. దీంతో అతడు బెంగళూరు, ముంబై అనంతరం దుబాయ్ కు మకాం మార్చాడు. తర్వాత దావూద్ ఇబ్రహీం అనుచరుడు శరద్ షెట్టితో పరిచయం పెంచుకున్నాడు. 2000లో షెట్టి చనిపోయాక.. రాయ్ గల్ఫ్ కు పారిపోయాడు. 2002లో కొన్ని క్రిమినల్ కేసుల నిమిత్తం రాయ్ ను బెంగళూరు పోలీసులు ఇండియాకు రప్పించారు. 2001లో జరిగిన సుబ్బరాజు సెన్సేషనల్ మర్డర్ కేసులో కూడా రాయ్ కు హస్తం ఉంది. అనంతర కాలంలో సోషలిస్టుగా మారిన రాయ్.. జయ కర్నాటక అనే నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ను స్థాపించాడు. దీని ద్వారా చాలా మంది పేదలకు సాయం చేస్తానని రాయ్ చెప్పాడు.