నకిలీ టికెట్లతో మోసపోతున్న నిరుద్యోగులు

నకిలీ టికెట్లతో మోసపోతున్న నిరుద్యోగులు
  • వీసాల పేరిట రూ.లక్షలు దండుకుంటున్న నకిలీ ఏజెంట్లు
  • నకిలీ టికెట్లతో మోసపోతున్న నిరుద్యోగులు
  • సోషల్ మీడియా వేదికగా అమాయకులకు ఎర 
  • రాజకీయ పలుకుబడితో రెచ్చిపోతున్న వైనం
  • పట్టించుకోని ఆఫీసర్లు

ఈ ఫొటోలో ఉన్న యువకులు.. గల్ఫ్ ఏజెంట్ డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఏజెంట్ ఇంటి ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మెట్ పల్లి కి చెందిన గల్ఫ్ ఏజెంట్ బొడ్డు వివేకానంద.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రీ గ్రామానికి చెందిన రాజశేఖర్, మోహన్, సంజీవ్, పరంధాం, అరుణ్ కుమార్, మోర్తాడ్ గ్రామానికి చెందిన కిషన్, ప్రశాంత్ ను మలేషియా పంపిస్తానని రెండు నెలల క్రితం ఒక్కొరి వద్ద రూ.లక్షా 20 వేలు, ఒరిజినల్ పాస్​పోర్టు తీసుకున్నాడు. రెండు వారాల్లో వీసా వస్తుందని చెప్పి నెల తర్వాత ఫోన్​చేశాడు. ‘వీసా వచ్చింది.. జూలై 8న హైదరాబాద్ నుంచి మలేషియాకు ఫ్లైట్ ఉందని చెప్పాడు. జూలై 6న ఆర్మూర్ బస్టాండ్ కు వస్తే టికెట్, పాస్​పోర్టు ఇస్తానని చెప్పాడు. 6న వాళ్లు ఆర్మూర్ బస్టాండ్ వెళ్లగా టికెట్, పాస్​పోర్టు ఇచ్చి వివేకానంద వెళ్లిపోయాడు. అనంతరం అక్కడే ఉన్న ట్రావెల్ లో వారు వీసా టికెట్ చెక్ చేసుకోగా అది నకిలీ టికెట్ అని తేలింది. దీంతో వివేకానంద మోసం చేశాడని గుర్తించి తమ డబ్బులు ఇవ్వాలని అతని ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.  

మెట్ పల్లి, వెలుగు: కొన్నేండ్లు కష్టపడితే బాగా డబ్బు సంపాదించొచ్చనే ఆశతో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్​జిల్లాల యువత ఎక్కువగా గల్ఫ్​బాట పడుతున్నారు. పల్లె యువత అమాయకత్వాన్ని, ఉద్యోగ అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న కొందరు గల్ఫ్ ఏజెంట్లు.. పని బాగుంటది. ఆకర్షణీయమైన జీతంతోపాటు భోజన వసతి కూడా కంపెనీయే చూసుకుంటుందని చెబుతూ వారిని ఏమారుస్తున్నారు. దీంతో అప్పు చేసి లక్షల రూపాయలు ఏజెంట్ల చేతిలో పెట్టి మోసపోతున్నారు.

లైసెన్స్ లేని ఏజెంట్ల హవా..

మెట్ పల్లి ప్రాంతంలో లైసెన్స్ లేని గల్ఫ్  ఏజెంట్లు వందల సంఖ్యలో పల్లెల బాట పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో మెట్ పల్లి కేంద్రంగా కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మేడిపల్లి, మల్యాల, కథలాపూర్, రాయికల్ తదితర ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఏజెంట్లను కలుస్తున్నారు. మరోవైపు సౌదీ, దుబయ్, కువైట్, బహ్రెయిన్​వంటి దేశాలకు వెళ్తే నెలకు రూ.30 వేల నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చని ఏజెంట్లు ఆశలు చూపుతున్నారు. మెట్ పల్లిలో కొందరు గల్ఫ్ ఏజెంట్లు వీసాల కోసం రూ.లక్ష నుంచి రూ. లక్షా 60 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు.

వీసా పేరిట మోసం..

ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల నుంచి లైసెన్స్ ఉన్న ఏజెన్సీలు తక్కువ సర్వీసు చార్జీలు వసూలు చేయాలి. కానీ ఇక్కడ సబ్ ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా గల్ఫ్ వెళ్లే వారి నుంచి పెద్ద మొత్తంలో  వసూలు చేస్తున్నారు. సబ్ ఏజెంట్లు పల్లెల్లో మొదట ఒకరిద్దరు కార్మికులను గల్ఫ్‌‌‌‌‌‌‌‌కు పంపించి వారిని చూపెట్టి మిగతా కార్మికులను నట్టేట ముంచుతున్నారు.   

జిల్లాలో 18 మందికే  లైసెన్స్

జగిత్యాల జిల్లాలో కేవలం 18 మందికే గల్ఫ్ పంపించే లైసెన్స్ లు ఉన్నాయి. సబ్ ఏజెంట్లు సుమారు 400కు పైగా ఉన్నట్లు సమాచారం. ఒక్కో  గ్రామంలో సుమారు 10 మంది వరకు సబ్ ఏజెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ఆయా గ్రామాల్లో తిరుగుతూ గల్ఫ్ వెళ్దామని అనుకుంటున్నవారిని మెయిన్ ఏజెంట్ వద్దకు తీసుకెళ్తారు. అక్కడ వీసా రేట్ ఫిక్స్ చేసుకుని ఒరిజినల్ పాస్ పోర్ట్, సగం డబ్బులు తీసుకుంటారు. వీసా వచ్చాక మిగతా డబ్బులు తీసుకుంటారు. ఒక పాస్ పోర్ట్ తీసుకొచ్చిన సబ్ ఏజెంట్ కు మెయిన్​ఏజెంట్ రూ.10 వేల దాకా 
ముట్టచెబుతాడు.

యువత మోసపోవద్దు 

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోకుండా జాగ్రత్త పడాలి. గల్ఫ్ వెళ్లాలనుకునేవారు వీసా గురించి అవగాహన కలిగి ఉండాలి. ఎంప్లాయిమెంట్ వీసాలను సమగ్రంగా పరిశీలించుకున్న తర్వాత వెళ్లాలి. లైసెన్స్ ఉన్న ఏజెంట్ ను సంప్రదించాలి. ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూస్తాం. - వంగ రవీందర్ రెడ్డి, డీఎస్పీ, మెట్ పల్లి.