ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా..సుమారు 400 మంది నుంచి లక్షల్లో వసూలు

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా..సుమారు 400 మంది నుంచి లక్షల్లో వసూలు
  • బోర్డు తిప్పేసి, ఫోన్‌‌ స్విచాఫ్‌‌ చేసిన నిందితుడు
  • ఆఫీస్‌‌ ఎదుట బాధితుల ఆందోళన

ఆదిలాబాద్‌‌ టౌన్‌‌, వెలుగు : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వందలాది మంది నుంచి లక్షలు వసూలు చేసిన ఓ వ్యక్తి చివరకు బోర్డు తిప్పేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌‌ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్​పట్టణంలోని రాంనగర్​పాత జాతీయ రహదారి పక్కన ఉన్న బిల్డింగ్‌‌లో జె.కృష్ణ అనే వ్యక్తి ఇటీవల డిజిటల్‌‌ మైక్రోఫైనాన్స్‌‌ పేరుతో ఓ ఆఫీస్‌‌ను ఓపెన్‌‌ చేశారు. ఈ సంస్థకు ఉట్నూర్‌‌, జైనూరులో సైతం బ్రాంచ్‌‌లు ఉన్నాయని, డిజిటల్‌‌ మైక్రోఫైనాన్స్‌‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వాట్సప్‌‌ గ్రూపుల్లో సర్క్యులేట్‌‌ చేశారు. 

ఫీల్డ్‌‌ లెవల్‌‌ ఉద్యోగాలతో పాటు సూపర్‌‌వైజర్‌‌, మేనేజర్‌‌ పోస్టులు ఉన్నాయంటూ ప్రచారం చేశారు. ఉద్యోగాన్ని బట్టి రూ. 18 వేల నుంచి రూ. 50 వేల వరకు జీతాలు ఇస్తామంటూ నమ్మించారు. ఈ ప్రచారాన్ని నమ్మిన నిరుద్యోగులు ఆఫీసుల ఎదుట క్యూ కట్టారు. ఉద్యోగాల కోసం వచ్చిన వారి నుంచి హోదాను బట్టి రూ. 20 వేలు మొదలుకొని రూ. లక్ష వరకు వసూలు చేశారు. ఇలా 400 మందిపైగా నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు తీసుకున్నారు. 

రోజులు గడుస్తున్నా ఉద్యోగం చూపించకపోవడం, జీతం ఇవ్వకపోవడంతో పాటు ఈ నెల 15 నుంచి కృష్ణ ఫోన్‌‌ స్విచాఫ్‌‌లో ఉంది. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు బుధవారం ఆఫీస్‌‌ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అనంతరం జిల్లా పోలీస్‌‌ ఆఫీస్‌‌కు వెళ్లి మైక్రోఫైనాన్స్‌‌ సంస్థ యజమాని జె.కృష్ణతో పాటు డైరెక్టర్లు మనిదీప్, రమేశ్‌‌ జాదవ్‌‌, మేస్రం ప్రహ్లాద్, సోనమ్‌‌సింగ్‌‌ రాథోడ్‌‌, ఆత్రం నారాయణ, చత్రుఘాన్‌‌, ఆత్రం రాహుల్‌‌పై ఎస్పీ అఖిల్‌‌ మహాజన్‌‌కు ఫిర్యాదు చేశారు.