నోటిఫికేషన్లు వేయడం లేదని నిరుద్యోగి ఆత్మహత్య

 నోటిఫికేషన్లు వేయడం లేదని నిరుద్యోగి ఆత్మహత్య
  •     పురుగుల మందు తాగి.. తమ్ముడికి ఫోన్​ చేసి ఆవేదన
  •     తల్లిదండ్రులకు భారం అయ్యానంటూ కన్నీరు
  •     వనపర్తి జిల్లా నిర్విన్​లో ఘటన
     

కొత్తకోట, వెలుగు: ‘‘బీఎడ్, పీజీ చేసి నాలుగేండ్లయినా ప్రభుత్వం టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వేస్త లేదు. కరోనా వల్ల ప్రైవేట్ జాబ్స్ దొరుకుత లేవు. ఇంత చదివి కూలీ పనులు చేస్తవా అని అందరంటుంటే వేరే పని చేయలేకపోతున్న. కష్టపడి చదివించిన అమ్మనాన్నలను ఉద్యోగం చేసి బాగా చూసుకోవాలనుకున్నా. ప్రభుత్వం జాబ్​నోటిఫికేషన్స్​ వేయడం లేదు. ఇక వేస్తుందన్న నమ్మకం కూడా పోయింది’’ అని తన తమ్ముడితో బాధ వెళ్లబోసుకుంటూ ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుతోనైనా నిరుద్యోగులు పడుతున్న  బాధలేంటో ప్రభుత్వం తెలుసుకొని కదలాలని కోరుకుంటూ ప్రాణం తీసుకున్నాడు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్విన్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. 

టీచర్​ జాబ్​ కోసం ప్రిపేరై..

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్విన్ ​గ్రామానికి చెందిన బాలయ్య, వెంకటమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు కురుమూర్తి పీజీ వరకు చదవగా, చిన్న కొడుకు మహేశ్ ​సెవెన్త్​వరకు చదివి కూలీ పనులకు వెళ్తున్నాడు. బీఎడ్ చేసిన కురుమూర్తి 2018లో పీజీ కూడా పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఊళ్లోనే ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నాడు. టీచర్​ రిక్రూట్​మెంట్​కు నోటిఫికేషన్ ​వస్తే జాబ్​కొట్టాలని ఎదురుచూస్తున్నాడు. నోటిఫికేషన్లు రాకపోవడంతో ఏదైనా ప్రైవేటు జాబ్​అయినా చూసుకోవాలనుకున్నాడు. కరోనా వల్ల ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్లలోనూ ఉద్యోగం దొరకలేదు. తర్వాత కొన్ని రోజులు గ్రామంలో ఏ పని దొరికితే అది చేశాడు. ఇంత చదివి కూలి చేస్తవా అని గ్రామస్తులు అనడంతో ఆ పని మానేశాడు. ఏదైనా బిజినెస్​ చేసుకుందామని గురువారం రాత్రి ఇంట్లో డబ్బులు అడిగాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన బాలయ్య సర్జరీకే అప్పులు చేశారని, ఇంకా అప్పు పుట్టే  పరిస్థితి లేదని తల్లిదండ్రులు చెప్పారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కురుమూర్తి వెంకటగిరి ఆలయం దగ్గరకు వెళ్లాడు. పురుగుల మందు తాగి తన తమ్ముడు మహేశ్​కు వీడియోకాల్ ​చేశాడు. జాబ్ కోసం ఎదురుచూసి విసిగి పోయానని, తనకు చావే పరిష్కారమని ఏడుస్తూ చెప్పాడు. తన చాపుతోనైనా నిరుద్యోగుల బాధలు ప్రభుత్వానికి తెలియాలని వాపోయాడు. మహేశ్​వెంటనే గుడి దగ్గరకు వెళ్లగా  కురుమూర్తి అపస్మారక స్థితిలో పడిఉన్నాడు. అతడిని కొత్తకోటకు, అక్కడి నుంచి మహబూబ్​నగర్​ జిల్లా హాస్పిటల్​కు తీసుకువెళ్లగా.. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.  వివిధ పార్టీలు, యువకులు​ఆందోళన చేస్తారన్న అనుమానంతో పోలీసులు మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించారు. శనివారం పోస్ట్ మార్టం తర్వాత  కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయకపోవడం వల్లే నిరుద్యోగుల ఆత్మహత్య లు పెరుగుతున్నాయని, కురుమూర్తిది ముమ్మాటికే ప్రభుత్వ హత్యేనని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి ఇతర లీడర్లు ఆరోపించారు