ఎన్నికల ఎజెండాగా నిరుద్యోగం!

ఎన్నికల ఎజెండాగా నిరుద్యోగం!

 

తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ పాలనలో నిరుద్యోగం నివురు గప్పిన నిప్పులా ఉంది. తెలంగాణలో యువత డిగ్రీ, పీజీ, పీహెచ్​డీలు చేసి ఉద్యోగాలు లేక విలవిలలాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది ప్రాణ త్యాగాలు చేసింది విద్యార్థులు, నిరుద్యోగులే. నియామకాలే ప్రధాన ఎజెండాగా  ఉద్యమం జరిగి రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యతలో నిరుద్యోగ యువత లేకుండా పోయారు. గత తొమ్మిది సంవత్సరాలలో  టీఎస్పీఎస్సీ ద్వారా కేవలం ముప్పై ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. ఆ తర్వాత టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, బోర్డు సభ్యులను నియమించారు. ఈ కొత్త కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్1, ఏఈ, ఏఈఈ  పరీక్షల పేపర్లు  లీకయ్యాయి. నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో లీకులపై ప్రభుత్వం సిట్ వేసింది. పేపర్ల లీకులకు కమిషన్​లో పని చేసే ఉద్యోగులే కారణం అని సిట్ ప్రాథమికంగా తేల్చింది. ఈ అంశంపై విచారణ ఇంకా కొనసాగుతున్నా.. నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో విశ్వాసం కలగడం లేదు.

కమిషన్ చైర్మన్, సభ్యులపై చర్యలేవి

టీఎస్పీఎస్సీలో పేపర్ల లీకేజీకి బాధ్యత వహించి ఛైర్మన్, సభ్యులు ఇప్పటివరకు ఎవరూ రాజీనామా చేయలేదు. ప్రభుత్వం కుడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ప్రభుత్వం కూడా ఈ లీకులను సమర్థిస్తుందా అనే అనుమానం ప్రతి నిరుద్యోగికి కలుగుతున్నది. కమిషన్ మాత్రం తిరిగి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని  నిర్ణయించింది. అసలు ఈ కమిషన్​పై నమ్మకం లేదని నిరుద్యోగులు  మొత్తుకుంటే అదే బోర్డు మెంబర్లతో కూడిన కమిషన్​ తిరిగి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం ఎంత వరకు సమంజసం ? ఈ ప్రశ్నకు  ప్రభుత్వం, కమిషన్ నుంచి సమాధానం కావాలి. పేపర్ల లీకేజీ పై సిట్ విచారణ జరుగుతుండగానే ప్రధాన నిందితులు బెయిలుపై విడుదలయ్యారు. నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించకుండానే కమిషన్ మొన్న ఏఈ పరీక్షను నిర్వహించింది. కానీ ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు యాభై శాతం దాటలేదు. దీన్ని బట్టి చూస్తే నిరుద్యోగులు ఈ లీకుల కమిషన్ ను నమ్మడం లేదనేది స్పష్టమవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని కమిషన్ చైర్మన్, సభ్యులను వెంటనే తొలగించాలి. అంతేకాకుండా పేపర్ల లీకులకు బాధ్యులైన అందరికీ కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే నిరుద్యోగులు అంతా సామూహిక పరీక్షల బహిష్కరణ చేయడానికి నిర్ణయం తీసుకుంటే అపుడు ప్రభుత్వం, కమిషన్ దేశ వ్యాప్తంగా అబాసుపాలు కావడం ఖాయం.

ప్రైవేటులో ఉపాధి ఏది?

ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. లక్షా పదివేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అటకెక్కింది. ప్రైవేటు ఉద్యోగాల కల్పన ఊసే లేకుండాపోయింది. ప్రైవేట్ పరిశ్రమలో స్థానికులకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు వస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ఆర్బాటంగా చెబుతున్నా, వాటిల్లో మన రాష్ట్ర యువత ఎంత మందికి ఉద్యోగాలు వస్తున్నాయో బయట పెట్టడం లేదు. ‘స్థానికత’ అనే దాన్ని ప్రయివేట్ వారు ఎక్కడా అమలు చేయడం లేదు. పరిశ్రమల్లో అంతా ఇతర రాష్ర్టాల వారే ఉద్యోగాల్లో నిండిపోయారు. తెలంగాణ వస్తే మాకేమి వచ్చిందని నిరుద్యోగులు నిట్టూరుస్తున్నారు. ఉద్యోగ కల్పనకు అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వ నిర్లక్యం మూలంగా నిరుద్యోగ యువత మూల్యం చెల్లించుకున్నారు. యువత ఆశలు అడియాసలయ్యాయి. తెలంగాణ రాష్ర్టంలో  కొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలకు నిరుద్యోగ అంశం రాజకీయ ఎజెండాగా మారింది. ఇప్పుడు రాజకీయ పార్టీల గెలుపు ఓటములను నిర్ణయించే వారిగా నిరుద్యోగ యువత మారిపోయారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్టీపీ వంటి పార్టీలు నిరుద్యోగులను తమ వైపు మల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా యువత, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించిన పాలకుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. తమకు ఉద్యోగాలు లేకుండా చేసి తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసి, తమను వంచించిన ప్రభుత్వంకు రిటన్​ గిఫ్ట్​ఇవ్వడానికి అంతా సిద్ధమవుతున్నారు.

ఉద్యోగాల భర్తీ లేక..

రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ప్రాధాన్యతల్లో ప్రాజెక్టులు, భూములు, పథకాలు వరుస క్రమంలో నిలిచాయి. కానీ నిరుద్యోగులకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ప్రజలు ఎవరు డిమాండ్ చేయకపోయినా లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టడానికి ప్రభుత్వం దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. కానీ 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంపై చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకోలేక ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మాత్రం మనసు లేకుండా పోయింది? దీనికి కారణం కూడా లేకపోలేదు. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారు అంతా కూడా పేదలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి పిల్లలు. అంతేకాకుండా నిరుద్యోగ యువత ఎప్పుడూ తమపై ఆధారపడి ఉండాలి తప్పితే ఆర్థికంగా స్వతంత్రులు కావద్దు అనే  ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ తనకు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం నిరుద్యోగులకు ఆగ్రహం కలిగిస్తున్నది. తమకు జరిగిన అన్యాయం పట్ల వారు రగిలిపోతున్నారు. ఎన్నికల ఏడాది నిరుద్యోగుల కోపం ఎలా వ్యక్తం కాబోతుందనేది నాయకులకు తెలియనిది కాదు. తొమ్మిదేండ్లుగా ఖాళీలను ఎప్పటికప్పుడు రిక్రూట్ చేయని రాష్ట్ర సర్కారు. లక్ష ఉద్యోగాల పేరుతో ఎన్నికల ఏడాది వరకు నాన్చింది. చివరకు ప్రశ్నపత్రాల లీకేజీలతో అంతా ఆగమాగం.. ఆందోళనగా మారింది పరిస్థితి.

పెరుగుతున్న నిరుద్యోగం..

దేశంలో జనాభా పెరుగుతున్నట్టే పనిచేయగల వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. అయితే దీనికి అనుగుణంగా ఉద్యోగ, ఉపాధి కల్పన జరగట్లేదని సెంటర్ పర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ ఇటీవల పేర్కొన్నారు. సీఎంఐఈ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మార్చిలో 7.8 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌‌ నాటికి 8.11 శాతానికి పెరిగింది. గత డిసెంబర్‌‌ తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు పెరగడం ఇదే తొలిసారి. గడిచిన నెల వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 8.51 శాతం నుంచి 9.81 శాతానికి పెరగ్గా, గ్రామాల్లో ఇదే సమయంలో 7.47 శాతం నుంచి 7.34 శాతానికి స్వల్పంగా తగ్గింది. ఇక దేశంలోని మొత్తం శ్రామికవర్గంలో కేవలం 43 శాతం మందికే ఉద్యోగాలు ఉండగా, ఇప్పటికిప్పుడు అర్హతకు తగిన ఉద్యోగాలు కావాల్సిన వారు 22 కోట్ల మంది వరకు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. తెలంగాణలో నిరుద్యోగం అదే స్థాయిలో ఉన్నది.

- డా.పెంట కృష్ణ, ఉస్మానియా యూనివర్సిటీ