సమష్టి డిమాండ్​ పెంచడంతో నిరుద్యోగితను నివారించవచ్చు

సమష్టి డిమాండ్​ పెంచడంతో నిరుద్యోగితను నివారించవచ్చు

అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగిత తాత్కాలికమైంది. సమష్టి డిమాండ్​ పెంచడం వల్ల నిరుద్యోగితను నివారించవచ్చు. కానీ అభివృద్ధి చెందుతున్న నిరుద్యోగిత వ్యవస్థాపూర్వకమైంది. మూలధనం కొరత వల్ల ఏర్పడుతుంది. దీనిని మూలధనం పెంచడం ద్వారా నివారించవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థకు శాశ్వతమైంది. తీవ్రమైంది.

కాలిక/ రుతు సంబంధ నిరుద్యోగిత: ఈ నిరుద్యోగిత వ్యవసాయ రంగంలో ఎక్కువగా కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో కొన్ని రుతువుల్లో పని లభించి, మరికొన్ని రుతువుల్లో పని లభించకపోవడాన్ని కాలిక నిరుద్యోగిత అంటారు. నైరుతి రుతపవన కాలంలో విత్తనాలు నాటేటప్పుడు, ఎరువులు వేసేటప్పుడు, పంట మార్పిడి సమయంలో 6 నుంచి 8 నెలల కాలంలో పని లభిస్తుంది. మిగిలిన కాలంలో పని లభించదు. 

అల్ప నిరుద్యోగిత: పూర్తి సామర్థ్యం ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే తక్కువ సామర్థ్యం ఉపయోగించి పని చేయడాన్ని అల్ప ఉద్యోగిత అంటారు. ఉపాధి కొరత వల్ల ఒక వ్యక్తి సామర్థ్యానికి తగిన పని దొరకకపోతే అది అల్ప నిరుద్యోగిత. ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాల కంటే తక్కువ సామర్థ్యం లేదా అర్హతలు గల పనిలో పాల్గొంటే అది అల్ప ఉద్యోగిత. అనైచ్ఛిక నిరుద్యోగిత: అమలులో ఉన్న వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధపడినప్పటికి, పని దొరకని పరిస్థితిని అనైచ్ఛిక నిరుద్యోగిత లేదా నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు. స్వచ్ఛంద నిరుద్యోగిత: అమలులోనున్న వేతనం వద్ద పని దొరికినప్పటికి పనికి వెళ్లనియెడల దాన్ని స్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు. 

నిరుద్యోగితకు కారణాలు 

ఉపాధి రహిత వృద్ధి: ఆర్థిక వృద్ధి కంటే ఉపాధి వృద్ధిరేటు తక్కువగా ఉంది. 2004–05 నుంచి 2011–12 మధ్య ఉత్పత్తి వృద్ధి వేగంగా పెరగగా ఉద్యోగిత వ్యాకోచత్వం 0.04 మాత్రమే. ఈ కాలంలో వ్యవసాయ ఉపాధి వ్యాకోచత్వం రుణాత్మకతలో ఉంది. అంటే ఉపాధి రహిత వృద్ధి నమోదవుతున్నది. సరిపడని విద్యా విధానం: వలస పాలనలో మెకాలే ప్రవేశపెట్టిన విద్యా విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. భారతదేశ విద్యా విధానం మానవ వనరులను అభివృద్ధి చేసే విధంగాలేదు. కేవలం గుమస్తాలను, దిగువ స్థాయి నిర్వహకులను ఉత్పత్తి చేసే విధంగా ఉంది. 

వ్యవసాయరంగంపై ఆధారపడటం: నేటికీ సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. సంస్కరణల తర్వాత ప్రభుత్వం వ్యవసాయంపై పెట్టుబడులు తగ్గించింది. 
శ్రామిక శక్తి: స్వాతంత్ర్యం తర్వాత మరణ రేటు వేగంగా తగ్గడంతో దేశ జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండో దశను చేరింది. మరణరేటు తగ్గినంత వేగంగా జనన రేటు తగ్గలేదు. ఫలితంగా జనాభా వృద్ధిరేటు ఎక్కువగా నమోదైంది. అందువల్ల శ్రామిక శక్తి ఎక్కువగా పెరిగింది. శ్రామిక శక్తి పెరగడంతో గ్రామాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగిత, పట్టణాల్లో బహిరంగ నిరుద్యోగిత పెరుగుతోంది. 

సరిపడని సాంకేతిక పరిజ్ఞానం: దేశంలో మూలధనం కొరతగా ఉంది. శ్రమ సమృద్ధిగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రమసాంద్రత పద్ధతిని అవలంబించాల్సి ఉంది. అందుకు బదులుగా మూలధనాన్ని ఉపయోగించి మూలధన సాంద్రత పద్ధతిని అవలంబించారు. దీనివల్ల నిరుద్యోగిత పెరిగింది. తక్కువ ఆర్థికాభివృద్ధి: స్వాతంత్ర్యానంతరం మూడు దశాబ్దాల్లో సాధించిన తక్కువ వృద్ధిరేటు నిరుద్యోగితను తగ్గించలేకపోయింది. ఉత్పత్తి పద్ధతుల ఎంపికలో మార్పులు, విద్యావిధాన పునర్వ్యవస్థీకరించడం, వృద్ధి కేంద్రాల ఏర్పాటు, ఉపాధి పథకాల అమలు చేయడం ద్వారా నిరుద్యోగితను కొంతవరకు తగ్గించవచ్చు. 

ప్రచ్ఛన్న నిరుద్యోగిత: ఏదైనా రంగంలో అవసరమైన వ్యక్తుల కంటే ఎక్కువ మంది వ్యక్తులు పనిచేస్తే వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. వీరిని పని నుంచి తొలగించినా మొత్తం ఉత్పత్తిలో మార్పు రాదు. అంటే వారి ఉపాంత ఉత్పత్తి సున్నాగా ఉంటుంది. ఎవరి ఉపాంత ఉత్పత్తి శూన్యంగా ఉంటుందో వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులుగా భావించవచ్చు. భారత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ తరహా నిరుద్యోగిత ప్రచ్ఛన్న నిరుద్యోగిత. వ్యవసాయ రంగం, సొంత వ్యాపారం చేసే దుకాణాల్లో ఈ నిరుద్యోగిత ఎక్కువగా కనిపిస్తుంది. 

పారిశ్రామిక నిరుద్యోగిత: గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కార్యకలాపాలు మందగించినప్పుడు శ్రామికులు ఫ్యాక్టరీల్లో 
ఉపాధి కోసం తరలిపోతున్నారు. పట్టణాల్లో శ్రామికుల కంటే పారిశ్రామిక రంగంలో కల్పించే ఉపాధి రేటు తక్కువగా ఉండటంతో పారిశ్రామిక నిరుద్యోగిత ఏర్పడుతుంది. దీన్నే పట్టణ నిరుద్యోగిత అని కూడా అంటారు. 

విద్యావంతుల్లో నిరుద్యోగిత: రోజురోజుకూ పెరుగుతున్న విద్యావంతుల సంఖ్య కంటే లభించే ఉపాధి అవకాశలు తక్కువ ఉండటంతో పట్టణాల్లో విద్యలేని వారిలో నిరుద్యోగిత కంటే విద్యావంతుల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉంది.సాంకేతిక నిరుద్యోగిత: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ సాంప్రదాయక సాంకేతిక పరిజ్ఞానంలో పనిచేసేవారు ఉపాధిని కోల్పోతారు. దీన్నే సాంకేతిక నిరుద్యోగిత అంటారు.