50 వేల మందితో..పాలమూరులో నిరుద్యోగ మార్చ్​

50 వేల మందితో..పాలమూరులో నిరుద్యోగ మార్చ్​

మహబూబ్​నగర్, వెలుగు:టీఎస్పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసును సిట్టింగ్​ జడ్జితో విచారణ చేయించి, ఎగ్జామ్స్​ రాసిన నిరుద్యోగులకు రూ.లక్ష చెల్లించాలని, మంత్రి కేటీఆర్​ను బర్తరఫ్​ చేయాలనే డిమాండ్లతో బీజేపీ నిరుద్యోగ​ మార్చ్​కు శ్రీకారం చుట్టింది. రెండో విడత కార్యక్రమాన్ని మంగళవారం పాలమూరులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మార్చ్​కు ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా నుంచి 50 వేల మంది నిరుద్యోగులు, యువత పాల్గొనేలా స్టడీ సెంటర్లు, కాలేజీల్లో సదస్సులు నిర్వహిస్తోంది.

బూత్​ కమిటీ నుంచి 10 మంది..

ఇటీవల బీజేపీ గ్రామ స్థాయి నుంచి బూత్​ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పాలమూరులో నిర్వహించే నిరుద్యోగ మిలియన్​ మార్చ్​ కార్యక్రమానికి బూత్​ కమిటీ సేవలను వినియోగిస్తుంది. నిరుద్యోగ మార్చ్​కు ఒక్కో బూత్​ కమిటీ నుంచి 10 మంది నిరుద్యోగులు, యువకులను తీసుకొచ్చేలా వారం కిందటే ప్లాన్​ చేసింది. దీని ప్రకారం ఒక్క పాలమూరు జిల్లాలో 832 కమిటీలు ఉండగా, ఈ కమిటీలు 8,320 మందిని కార్యక్రమానికి తీసుకురానున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, అలంపూర్, నాగర్​కర్నూల్, నారాయణపేట, మక్తల్, కొడంగల్​, కొల్లాపూర్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్​నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్​నగర్​ నియోజకవర్గాల నుంచి 3 వేల మంది చొప్పున 42 వేల మందిని తరలించేందుకు జిల్లాల అధ్యక్షులు వీరబ్రహ్మచారి, పగడాల శ్రీను, దిలీపాచారి, రాంచందర్​రెడ్డి, రాజవర్ధన్​రెడ్డి, లీడర్లు డోకూర్​ పవనకుమార్​ రెడ్డి, ఆర్​బాలాత్రిపుర సుందరి, జలంధర్​రెడ్డి, ఎన్పీ వెంకటేశ్​, సత్య యాదవ్​, ఎల్లేని సుధాకర్​రావు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్టడీ సెంటర్లలో మీటింగ్​లు..

బీజేపీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి ఆధ్వర్యంలో మూడు రోజులుగా దరువు ఎల్లన్న, వరంగల్​ జేఏసీ చైర్మన్  పుల్లారావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్తకోట కిరణ్ కుమార్​రెడ్డి​స్టూడెంట్లతో ఇంట్రాక్ట్​ అవుతున్నారు. స్టడీ సెంటర్లు, పాలమూరు యూనివర్సిటీలను విజిట్​ చేసి పేపర్​ లీకేజీపై  జరుపుతున్న పోరుకు రావాలని పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటికే నీళ్లు, నిధులు పక్కదారి పట్టాయని, ఉద్యోగ నియామకాల్లో కూడా యువతకు అన్యాయం జరుగుతోందనే విషయాన్ని వివరిస్తున్నారు. ఇప్పుడు మేల్కోకపోతే తెలంగాణ యువత భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారుతుందని, మిలియన్​ మార్చ్​ను సక్సెస్​ చేయాలని కోరుతున్నారు. దరువు ఎల్లన్న, పుల్లారావు పాటల ద్వారా స్టూడెంట్లలో చైతన్యం తీసుకొస్తున్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లాల్లో మనోహర్​రెడ్డి, వీరేందర్​గౌడ్​, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్​ విస్తృతంగా పర్యటిస్తూ ప్రతీ నిరుద్యోగి, యువత కార్యక్రమానికి రావాలని పిలుపునిస్తున్నారు.

కార్యక్రమం ఇలా..

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద మధ్యాహ్నం నిరుద్యోగులు, యువతను సమీకరించి, 4 గంటలకు మార్చ్​ను ప్రారంభించనున్నారు. గవర్నమెంట్​ బాయ్స్​ కాలేజీ, అంబేద్కర్​ చౌరస్తా, అశోక్​ టాకీస్​ మీదుగా క్లాక్​ టవర్​ వద్దకు చేరుకోనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే సభలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్​రెడ్డి  మాట్లాడిన తర్వాత పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్  యువతను ఉద్దేశించి​ ప్రసంగించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగులు, యువతను తరలించేందుకు 60 బస్సులు, 500 ఇతర వెహికల్స్​ ఏర్పాటు చేస్తున్నారు.