దేశంలో పనిచేసేటోళ్లే ఎక్కువున్నరు!

దేశంలో పనిచేసేటోళ్లే ఎక్కువున్నరు!
  • 2055 వరకూ కొనసాగుతుందన్నయూఎన్ఎఫ్ పీఏ
  • అందిపుచ్చుకుంటే ఆర్థికాభివృద్ధికి ఆకాశమే హద్దు
  • డెమొగ్రాఫిక్‌ డివిడెండ్‌‌తో ఆర్థిక శక్తులుగా ఎదిగిన చైనా, జపాన్, దక్షిణ కొరియా

ఇండియాలో కూర్చొని తినేవాళ్ల కంటే పని చేసే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్‌‌ ఫండ్‌‌ (యూఎన్ఎఫ్ పీఏ) తేల్చింది. 2018 నుంచి 15 ఏళ్ల వయసు నుంచి 64 ఏళ్ల వయసు కలిగిన ఇండియన్లు ఏదో ఒక పని చేస్తూ సంపాదిస్తున్నారని పేర్కొంది. 14 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉన్న పిల్లలు, 65 ఏళ్లు వచ్చిన పెద్దవాళ్లు మాత్రమే ఇంట్లోని మిగతా వాళ్లపై ఆధారపడుతున్నారని తెలిపింది. 2055 వరకూ దేశంలో పనిచేసే వాళ్ల జనాభా, వారి మీధ ఆధారపడి బతుకుతున్న వాళ్లకంటే పెరుగుతుందని  వెల్లడించింది. దీనిని డెమొగ్రాఫిక్‌‌ డివిడెండ్‌‌గా పిలుస్తారని పేర్కొంది.

జపాన్‌‌, చైనా ఇలాగే ఎదిగాయ్‌‌

జపాన్, చైనా, దక్షిణ కొరియా ఇలాంటి ‘పనిచేసే వాళ్ల’తోనే దేశాభివృద్ధిని విపరీతంగా పెంచుకున్నాయని యూఎన్ఎఫ్ పీఏ తెలిపింది. దేశంలో సంతాన రేటు  తగ్గినప్పుడు, జీవనకాలం పెరిగినప్పుడు ఇలా పనిచేస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతుందని వివరించింది. ఆసియా ఖండంలో తొలిసారిగా జపాన్‌‌లో 1964 నుంచి 2004 మధ్య ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పింది. ఫలితంగా జపాన్‌‌లో విపరీతమైన అభివృద్ధి జరిగిందని వెల్లడించింది. తొలి ఐదేళ్లలో ఆ దేశం రెండంకెల వృద్ధిని సాధించిందని చెప్పింది. తొలి పదేళ్లలో కేవలం రెండేళ్లు మాత్రమే జపాన్ జీడీపీ 5 శాతం కంటే తక్కువగా నమోదైందని తెలిపింది.

డెంగ్ జియావో పింగ్ 1978లో చైనాలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 1994లో ఆ దేశంలో పనిచేసే వాళ్ల సంఖ్య బాగా పెరగడం మొదలుపెట్టింది. ఇలా పదహారేళ్ల పాటు కొనసాగింది. ఆర్థిక సంస్కరణలు కుదురుకునే సమయంలో అనుకోకుండా పెరిగిన పనిచేసేటోళ్ల వల్ల  చైనాను సుస్థిర అభివృద్ధి దిశగా నడిపింది.1978 నుంచి 1994 మధ్య చైనా ఎనిమిది సార్లు రెండంకెల వృద్ధిని సాధించింది. 1994 తర్వాత ఆ దేశంలో కేవలం రెండు సార్లు మాత్రమే 8% కన్నా తక్కువ జీడీపీ ఉంది. సింగపూర్‌‌లో 1979 నుంచి పనిచేసే జనాల సంఖ్య పెరగడం మొదలైంది. ఆ తర్వాత పదేళ్లలో రెండు సార్లు మాత్రమే ఆ దేశం 7% కన్నా తక్కువ జీడీపీ వృద్ధిని నమోదు చేసింది.  నాలుగేళ్ల పాటు రెండంకెల వృద్ధి నమోదైంది. దక్షిణ కొరియాలో ఈ పరిస్థితి తొలిసారిగా 1987లో వచ్చింది. ఆ తర్వాతి పదేళ్లలో ఆ దేశ వృద్ధి రేటు కేవలం రెండు సార్లు మాత్రమే 7% కంటే తక్కువగా ఉంది. హాంకాంగ్‌‌దీ అదే దారి.

దాంతో పాటు మంచి అవకాశాలూ ఉండాలి

పనిచేసేటోళ్లు పెరిగినంత మాత్రాన ఆయా దేశాల్లో అభివృద్ధి జరగలేదని, మంచి ఆరోగ్యం, చదువు, ఉద్యోగ అవకాశాలు కల్పించాయని, వాటి వల్లే అభివృద్ధి జరిగిందని యూఎన్‌‌ఎఫ్‌‌పీఏ చెప్పింది.  20వ శతాబ్దం చివర్లో ఆసియాలో పెరిగిన వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఆయా దేశాల్లో జీడీపీని ఏడు రెట్లు పెంచిందని తెలిపింది. కానీ ఇదే టైంలో లాటిన్ అమెరికాలో పెరిగిన వర్కింగ్ ఏజ్ పాపులేషన్, ఆయా దేశాల జీడీపీని రెండు రెట్లు మాత్రమే పెరిగేలా చేసిందని వివరించింది.