యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు .. ఉత్తరాఖాండ్ అసెంబ్లీ ఆమోదం

యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు ..  ఉత్తరాఖాండ్ అసెంబ్లీ ఆమోదం

ఉత్తరాఖాండ్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు ఆమోదం తెలిపింది.  సీఎం పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోనే  ఈ బిల్లు అమల్లోకి తీసుకురానున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖాండ్ నిలువనుంది. ఈ బిల్లు ఆదివాసులకు వర్తించదని సీఎం పుష్కర్ సింగ్ ధామి  తెలిపారు. 

యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ప్రభుత్వం గవర్నర్ కు పంపించనుంది. గవర్నర్ సంతకం చేసిన వెంటనే ఇది చట్టంగా మారుతుంది ..  అనంతరం ఈ బిల్లు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు   అమల్లోకి రానుంది.  యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తామని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హమీ ఇచ్చింది.  ధామి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించి ఓ కమిటీని కూడా  ఏర్పాటు చేసింది.  ఈ కమిటీ 2.5 లక్షలకు పైగా సూచనలను స్వీకరించిన తర్వాత యూనిఫాం సివిల్ కోడ్ ముసాయిదాను సిద్ధం చేసింది.

 

అసెంబ్లీలో సీఎం పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ..  యూనిఫాం సివిల్ కోడ్ వివాహం, పోషణ, వారసత్వం, విడాకులు వంటి విషయాలపై ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ సమానత్వ హక్కును ఇస్తుందన్నారు.  ప్రధానంగా మహిళల పట్ల వివక్షను తొలిగిస్తుందిని అభిప్రాయపడ్డారు.