బడ్జెట్​లో ఇన్​కమ్​ ట్యాక్స్​ తగ్గించాలని ఎక్స్​పర్ట్​ల సూచన

బడ్జెట్​లో ఇన్​కమ్​ ట్యాక్స్​ తగ్గించాలని ఎక్స్​పర్ట్​ల సూచన

వెలుగు బిజినెస్​ డెస్క్​: దేశంలో మూడింట రెండొంతుల మందిగా ఉన్న మిడిల్​క్లాస్​ను గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు బడ్జెట్లలో పెద్దగా పట్టించుకోవడం లేదని కొంత మంది ఎక్స్​పర్టులు విమర్శిస్తున్నారు. రాబోయే 25 ఏళ్లలో దేశంలో మిడిల్​క్లాస్​ జనాభా రెట్టింపవుతుందనే అంచనాలున్నాయి. ఎక్కువ పన్నులు కడుతున్నామని దేశంలోని మిడిల్​ క్లాస్​ జనాభా వాపోతున్నారు. ఇలా చెల్లించినా, షార్ట్​టర్మ్​లో తమకు ఎలాంటి ప్రయోజనాలు దక్కడం లేదని తలపోస్తున్నారు. దీంతో ఈసారి బడ్జెట్​లోనైనా పర్సనల్​ ఇన్​కమ్‌‌ ట్యాక్స్​ విషయంలో ఏదైనా వెసులుబాటు ఉంటుందేమోనని వెయ్యి కళ్లతో వారు ఎదురుచూస్తున్నారు. ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ ఇటీవల ఒక సందర్భంలో తానూ మిడిల్​క్లాసేనని చెబుతూ, ప్రస్తుత ప్రభుత్వం మిడిల్​క్లాస్​ ప్రజలకు భారమయ్యేలా పన్నులేవీ విధించలేదని పేర్కొన్నారు. మిడిల్​క్లాస్​ కుటుంబాల ఒత్తిళ్లు ఎలా ఉంటాయో తనకు ప్రత్యక్షంగా తెలుసని నిర్మలా అన్నారు. మిడిల్​క్లాస్​ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా ప్రభుత్వం వారి కోసం కొంత ఎక్కువే మేలు చేస్తుందనే హామీని కూడా ఇచ్చారు. మిడిల్​క్లాస్​ ప్రజల కోసం చాలా చేశామని, ఇంకా చేస్తూనే ఉంటామని నిర్మలా స్పష్టం చేశారు. 

పడిపోయిన కుటుంబ పొదుపు..

దేశంలో ఇన్​ఫ్లేషన్​ పెరగడంతో కుటుంబాల పొదుపు అయిదేళ్ల కనిష్టానికి పడిపోయింది. మిడిల్​క్లాస్​ పర్చేజింగ్​ పవర్​ను ఇన్​ఫ్లేషన్​ హరించేసింది. దేశంలోని కుటుంబ పొదుపు 2020–21లో 15.9 శాతమైతే, అది 2021–22 ఫైనాన్షియల్​ ఇయర్​ నాటికి 10.8 శాతానికి తగ్గిపోయింది. అంతకు ముందు మూడేళ్లకు చూసినా ఈ కుటుంబ పొదుపు 12 శాతంగా ఉండేది. అవసరాల కోసం లోయర్​ మిడిల్​క్లాస్​ ప్రజలు  పొదుపు నుంచి డబ్బు వాడేయడంతో వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. 

ప్రభుత్వం చొరవ తీసుకోవాలి..

దేశంలోని మిడిల్​క్లాస్​ ప్రజల ఆదాయం పెరిగేలా, మరిన్ని ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవచ్చని ప్రొఫెసర్​ అరుణ్​కుమార్​ చెప్పారు. అన్​ఆర్డనైజ్డ్​ సెక్టార్లో డిమాండ్​ పెరిగేలా చర్యలు తీసుకుంటే మంచిదని చెబుతూ, ఫలితంగా స్లోడౌనవుతున్న ఆర్గనైజ్డ్​ సెక్టార్​ మళ్లీ వేగంగా పుంజుకుంటుందని పేర్కొన్నారు. దేశంలో డిమాండ్​ పెరిగేలా చొరవ తీసుకుంటే స్లోడౌన్​ను నివారించొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్​ఆర్గనైజ్డ్ సెక్టార్​పై జీఎస్​టీ దెబ్బకొట్టిందని, కరోనా మహమ్మారి కంటే ముందే గ్రోత్​పై ఎఫెక్ట్​ చూపెట్టిందని అరుణ్​కుమార్​ చెప్పారు. జీఎస్​టీ అనేది లాస్ట్​పాయింట్ ​ట్యాక్స్​ కాబట్టి, ప్రొడక్షన్​, డిస్ట్రిబ్యూషన్​, సప్లయ్​చెయిన్​ మొత్తం మీద కాకుండా చివరి పాయింట్లో మాత్రమే దానిని వసూలు చేసేలా మెకానిజం ఉండాలని పేర్కొన్నారు. ఫలితంగా అన్​ఆర్గనైజ్డ్​ సెక్టార్​ తిరిగి పుంజుకుంటుందన్నారు.అర్బన్​ ఏరియాలలోని ప్రజల కోసం ఎంప్లాయ్​మెంట్​ గ్యారంటీ స్కీము తేవాలని సూచించారు. 2020 నుంచి ప్రతీసారీ బడ్జెట్లో క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ పెంచుతున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్​ చెప్పారు. ఈ ఫైనాన్షియల్​ఇయర్లో క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ను ఏకంగా 35 శాతం పెంచి  రూ. 7.5 లక్షల కోట్లు గా చేసినట్లు పేర్కొన్నారు. 

వాడకం  పెంచేది వారే..

దేశంలో వినియోగాన్ని  నడిపించేది మిడిల్​క్లాస్​ ప్రజలేనని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. దేశం డెవలప్డ్​ ఎకానమీగా మారాలంటే మరింత ఎక్కువగా వారి వినియోగం ఉండేలా చూడాలని పేర్కొంటున్నారు. ఇండియా గ్రోత్​రేట్​ సైకిల్ గరిష్టస్థాయికి చేరిందని, స్లోడౌన్​ వస్తుందని ఇటీవలే నోమురా ఎనలిస్టులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. దేశ జీడీపీ సెప్టెంబర్​ క్వార్టర్లో 6.3 శాతం పెరిగిందనే ప్రకటన వచ్చాకే ఆ ఎనలిస్టులు తమ రిపోర్టును తెచ్చారు. అంతకు ముందు క్వార్టర్​తో పోలిస్తే జీడీపీ గ్రోత్​ సగానికి పడిపోయిన విషయం తెలిసిందే. ​

అప్పులపాలైన లోయర్ ​మిడిల్ ​క్లాస్....​

అప్పర్​ మిడిల్​క్లాస్​ ప్రజలు కరోనా టైములోనూ తమ పనులు తాము చేసుకోగలిగారు. కానీ, ఫ్యాక్టరీలను మూసివేయడంతో వాటిలో పనిచేసే లోయర్​ మిడిల్​క్లాస్​ ప్రజలకు గట్టి దెబ్బ తగిలిందని రిజర్వ్​ బ్యాంక్​ మాజీ గవర్నర్​ రఘురామ్​రాజన్ పేర్కొన్నారు. దీంతో అప్పర్ ​మిడిల్​ క్లాస్​- లోయర్​ మిడిల్​క్లాస్​ల మధ్య తేడా మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. పేద ప్రజలకు రేషన్​ దొరికింది. దాంతోపాటే అన్నీ దొరికాయి. సంపన్నులకు ఎలాంటి కష్టాలూ ఎదురవలేదు. కాకపోతే, లోయర్​ మిడిల్​క్లాస్​ ప్రజలు మాత్రం బాగా నష్టపోయారని రఘురామ్​రాజన్​ చెప్పారు. వారి ఉద్యోగాలు పోయాయి. నిరుద్యోగం పెరిగింది. వాళ్ల అప్పులు పెరిగిపోయాయి. వీటిని మనం పట్టించుకోవాలని రాజన్​ సూచించారు.