4 రైల్వే ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు.. 4 రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో కనెక్టివిటీ

4 రైల్వే ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు.. 4 రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో కనెక్టివిటీ
  • కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి

న్యూఢిల్లీ: మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్ రాష్ట్రాల్లో చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్​ల కోసం రూ.24,634 కోట్లు కేటాయించింది. ఈ 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు.. మొత్తం 18 జిల్లాలను కవర్ చేస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. నాలుగు రాష్ట్రాల్లో చేపట్టబోయే ప్రాజెక్టులతో 894 కిలో మీటర్ల రైల్వే లైన్ల విస్తరణ జరుగుతున్నదని తెలిపారు. ఈ నాలుగు ప్రాజెక్టులు మొత్తం 3,633 గ్రామాలతో కనెక్టివిటీ పెంచుతుందని అన్నారు. సుమారు 85.84 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వచ్చే ఐదేండ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద అభివృద్ధి
పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద ఈ నాలుగు రైల్వే ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు. ‘‘ఈ రైల్వే లైన్ సామర్థ్యం భారతీయ రైల్వేలకు మెరుగైన కార్యాచరణ అందిస్తుంది. సాంచి, సాత్పురా టైగర్ రిజర్వ్, భీంబెట్కాలోని రాక్ షెల్టర్, హజారా జలపాతం, నవేగావ్ నేషనల్ పార్క్ వంటి పర్యాటక ప్రాంతాలను ఈ రైల్వే లైన్లు కవర్ చేస్తాయి. బొగ్గు, కంటైనర్లు, సిమెంట్, ఫ్లై యాష్, ఆహార ధాన్యాలు, ఐరన్ వంటి వాటి రవాణాకు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుంది. రైల్వే లైన్‌‌ సామర్థ్యం పెరగడంతో ఏటా 78 మిలియన్ టన్నుల సరుకు ట్రాన్స్​పోర్టు అవుతుంది’’ అని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.