చేతివృత్తుల వారికి .. రూ.3 లక్షల లోన్

చేతివృత్తుల వారికి .. రూ.3 లక్షల లోన్
  • ‘పీఎం విశ్వకర్మ యోజన’కు కేంద్ర కేబినెట్ ఆమోదం
  • 5% రాయితీ వడ్డీతో రెండు విడతలుగా రుణాలు      
  • రోజుకు రూ. 500 స్టైపెండ్​తో ట్రెయినింగ్  
  • మోడ్రన్ టూల్స్ కొనుక్కునేందుకు రూ. 15 వేల సాయం
  • దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు రూ.13 వేల కోట్లు
  • తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో 7 రైల్వే ప్రాజెక్టులు  
  • ‘పీఎం ఈ- బస్ సేవ’ కింద.. 10 వేల ఎలక్ట్రిక్ బస్సులు

న్యూఢిల్లీ: పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారికి, చేతి వృత్తుల కళాకారులకు ట్రెయినింగ్, పనిముట్లు కొనేందుకు ఆర్థిక సాయం, వడ్డీ రాయితీపై రుణా లను అందించే ‘పీఎం విశ్వకర్మ యోజన’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పంద్రాగస్టు సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్కీంను ప్రకటించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ స్కీంను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కమిటీ (ఆర్థిక వ్యవహారాలు) ఈ మేరకు విశ్వకర్మ యోజనతోపాటు ఇతర పలు పథకాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని, వీరిలో ప్రధానంగా ఓబీసీలే ఎక్కువ మంది ఉంటారని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ స్కీంను 2024 ఆర్థిక సంవత్సరం నుంచి 2028 ఆర్థిక సంవత్సరం వరకూ ఐదేండ్ల పాటు అమలు చేస్తామని, తొలి ఏడాది 5 లక్షల కుటుంబాలు కవర్ అవుతాయన్నారు. చేతివృత్తుల వారికి నైపుణ్యాలు పెంచడం ద్వారా నాణ్యతను మెరుగుపర్చడం, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ ను పెంచడం, చేతివృత్తుల వారు, కళాకారులు దేశీ, విదేశీ మార్కెట్ లో భాగస్వాములు అయ్యేలా చూడటమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశమని ఆయన వెల్లడించారు. 

స్కీం అమలయ్యేది ఇలా..

పీఎం విశ్వకర్మ యోజన కింద ఎంపిక చేసే లబ్ధిదారులకు ముందుగా పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్, ఐడీ కార్డును అందజేస్తారు. 
లబ్ధిదారులకు మొదటి విడతలో రూ.లక్ష రుణం, రెండో విడతలో రూ. 2 లక్షల రుణాన్ని 5% రాయితీ వడ్డీపై అందజేస్తారు. 
స్కిల్ అప్ గ్రెడేషన్ కోసం రోజుకు రూ. 500 స్టైపెండ్ అందిస్తూ  శిక్షణ కూడా ఇస్తారు.
ట్రెయినింగ్ తర్వాత మోడ్రన్ టూల్స్ కొనుగోలుకు రూ. 15 వేల ఆర్థిక సాయం చేస్తారు.

వర్తించేది వీరికే.. 

కమ్మరి, వడ్రంగి, కుమ్మరి, స్వర్ణకారులు, చర్మకారులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, శిల్పులు/రాళ్లు పగలగొట్టేవాళ్లు, తాళాలు తయారీ/రిపేర్ చేసేవాళ్లు, మేస్త్రీలు, బుట్టలు/చీపుర్లు/మ్యాట్ల తయారీదారులు, బొమ్మల తయారీదారులు,  పూలదండలు అల్లేవారు, చేపల వలలు తయారుచేసేవారు, పడవల తయారీదారులు, హ్యామర్, టూల్ కిట్ మేకర్లు, చిన్న చిన్న ఆయుధాలు తయారుచేసేవారు.

డిజిటల్ ఇండియా స్కీం పొడిగింపు

డిజిటల్ ఇండియా ప్రాజెక్టును పొడిగించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు పొడిగింపు కోసం రూ. 14,903 కోట్లు కేటాయించేందుకు ఓకే చెప్పింది. ఈ స్కీం కింద ఇదివరకే చేపట్టిన పనుల కొనసాగింపు కోసం పథకాన్ని పొడిగించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 5.25 లక్షల ఐటీ ప్రొఫెషనల్స్ కు రీస్కిల్లింగ్, 2.65 లక్షల మందికి అప్ స్కిల్లింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఈ మిషన్ కింద 18 సూపర్ కంప్యూటర్లు ఉన్నాయని, డిజిటల్ ఇండియా ప్రాజెక్టు కింద మరో 9 సూపర్ కంప్యూటర్లను తయారు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

‘పీఎం ఈ‑ బస్ సేవ’ కింద.. 10 వేల ఎలక్ట్రిక్ బస్సులు

దేశవ్యాప్తంగా169 సిటీల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు గాను ‘పీఎం ఈ–బస్ సేవ’ స్కీమ్​కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఆర్గనైజ్డ్ బస్ సర్వీసులు లేని సిటీలకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 

అలాగే గ్రీన్ మొబిలిటీ ఇనీషియేటివ్స్ కింద 181 సిటీల్లో ఇన్​ ఫ్రాస్ట్రక్చర్​ను మెరుగుపర్చనున్నారు. పీఎం ఈ–బస్ సేవ పథకానికి మొత్తం రూ.57,613 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇందులో కేంద్రం రూ.20 వేల కోట్లను అందించనుంది. మిగతా మొత్తాన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు భరించాల్సి  ఉంటుంది.