
ఢిల్లీ: ప్రధానిమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలు స్తోంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో పలు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రేపు కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరగనున్నాయి. మహిళ రిజర్వేషన్ బిల్లు, ఓబీసీ బిల్లులు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. వీటితోపాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ , దేశం పేరు మార్పు బిల్లును కూడా తీసుకువస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. తక్కువ సమయం ఉన్న ఈ సమావేశాల్లో ఏఏ బిల్లులు ఆమోదించబడతాయి.. వేటిపై చర్చలు జరుగుతాయి అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.
ALSO READ: సెప్టెంబర్ 19 నుంచి కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు
ఈ భేటీలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ, జైశంకర్, పీయూష్ గోయల్, గడ్కరీ, తోమర్ పాల్గొన్నారు. కేబినెట్ భేటీ కంటే ముందు పలువురు మంత్రులు కీలక సమావేశాలు జరిపారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సమావేశంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నట్లు సమాచారం. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది.