రాజస్థాన్​లో 25 ఎంపీ సీట్లలో మాదే గెలుపు: అమిత్​ షా

రాజస్థాన్​లో 25 ఎంపీ సీట్లలో మాదే గెలుపు: అమిత్​ షా

జైపూర్: రాజస్థాన్​లోని 25 లోక్​సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్​షా ధీమా వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రం.. మొత్తం ఎంపీ స్థానాలను ప్రధాని మోదీకి ఇవ్వబోతోందని ఆయన పేర్కొన్నారు. శనివారం రాజస్తాన్​లోని భిల్వారాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. జలోర్ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌‌ కొడుకు వైభవ్ గెహ్లాట్ ఈ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోతాడని తెలిపారు. శుక్రవారం మొదటి దశలో జరిగిన ఎన్నికల్లో 12 స్థానాలు నరేంద్ర మోదీకే వస్తాయని, రెండో దశలో జరగబోయే 13 స్థానాలను సైతం మోదీకే ఇచ్చి రాజస్థాన్ హ్యాట్రిక్ సాధించబోతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక ప్రతి మూడు నెలలకొకసారి విదేశాలకు విహారయాత్రలకు వెళ్తారని షా విమర్శించారు. 

మోదీకి ఓటేయడం అంటే.. ‘మహాభారత్‌‌’ సృష్టికి ఓటేయడమేనని షా అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ ఓటు బ్యాంకును కోల్పోతామనే భయంతోనే అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాలేదని ఆరోపించారు. ఓటు బ్యాంకు కోసం అత్యాశతో రామ్‌‌లల్లాను దర్శించుకోని వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. ‘‘గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో టెర్రరిస్టులు దాడులు చేసేవారు. మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా పుల్వామాలో దాడి చేశారు. కానీ, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదని.. బీజేపీ ప్రభుత్వమని, మోదీ ప్రధాని అని మరిచిపోయారు. 

దీంతో కేవలం 10 రోజుల్లోనే సర్జికల్ దాడులు చేసి టెర్రరిస్టులను అంతమొందించాం" అని షా పేర్కొన్నారు. ‘‘కాశ్మీర్‌‌, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. నక్సలిజం పతనం అంచున ఉంది. దేశాన్ని సురక్షితంగా, సుభిక్షంగా మార్చేందుకు మోదీ కృషి చేశారు. పదేండ్లలో ఆర్థిక వ్యవస్థను 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేర్చారు. మళ్లీ మోదీని ప్రధానిని చేస్తే.. దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది” అని అమిత్​ షా అన్నారు.