బీఆర్ఎస్ అవినీతిపై విచారణ..అధికారంలోకి రాగానే కమిటీ వేస్తం.. మేనిఫెస్టోలో బీజేపీ హామీ

బీఆర్ఎస్ అవినీతిపై విచారణ..అధికారంలోకి రాగానే కమిటీ వేస్తం.. మేనిఫెస్టోలో బీజేపీ హామీ
  • పెట్రోల్, డీజిల్​పై వ్యాట్ తగ్గింపు 
  • మహిళా రైతులకు ప్రత్యేకంగా కార్పొరేషన్
  • ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
  • మతపరమైన రిజర్వేషన్లు రద్దు.. ఎస్టీ రిజర్వేషన్లు పెంపు   
  • వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్రలు 
  • 10 అంశాలతో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా 

హైదరాబాద్‌, వెలుగు : రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వ కుంభకోణాలన్నింటిపై విచారణ జరిపిస్తామని బీజేపీ ప్రకటించింది. దోషులను న్యాయస్థానం ముందు నిలబెడతామని తెలిపింది. ‘‘వివిధ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై వైట్​ పేపర్​ విడుదల చేస్తం. అభివృద్ధి పేరుతో అంచనాలు విపరీతంగా పెంచి, భారీగా నిధులు ఖర్చు చేసిన పలు ప్రాజెక్టులపై దర్యాప్తు జరిపిస్తం. ఇందుకోసం హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేస్తం. దోపిడీలో భాగమైన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం” అని మేనిఫెస్టోలో పేర్కొంది. శనివారం హైదరాబాద్ లో బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. 10 అంశాలతో ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరుతో దీన్ని తీసుకొచ్చారు. వరికి మద్దతు ధర రూ.3,100 చెల్లిస్తామని.. చిన్న, సన్నకారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుక్కునేందుకు రూ.2,500 ఇస్తామని మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భర్తీ చేస్తామని ప్రకటించింది.

భూమాఫియాకు అనుకూలంగా మారిన ధరణిని రద్దు చేస్తామని, దాని స్థానంలో ‘మీ భూమి’ పేరుతో పారదర్శకమైన వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని బీజేపీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేకంగా నోడల్‌ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తామంది. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ధరలు అమలు చేస్తామని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు చెల్లిస్తామని హామీ ఇచ్చింది.  
మేనిఫెస్టోలోని కీలక అంశాలివీ..

1.    సుపరిపాలన 

  • బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలన్నింటిపైనా విచారణ. ఓఆర్ఆర్ టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్ (టీఓటీ) బిడ్డింగ్ ప్రక్రియపై దర్యాప్తు. బిడ్ కేటాయింపుపై  పునఃసమీక్ష. వ్యవస్థీకృత భూ-మాఫియాకు అనుకూలంగామారిన ధరణి రద్దు. దాని స్థానంలో పారదర్శకమైన ‘మీ భూమి’ వ్యవస్థ ఏర్పాటు. 

  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెగ్యులర్ గా పీఆర్సీ అమలు. ప్రతి ఐదేండ్లకోసారి పీఆర్సీ రివిజన్. ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు, పింఛన్ల చెల్లింపు. జీవో 317 అమలుపై పునఃసమీక్ష. 
  • విదేశాల్లో ఉంటున్న తెలుగు వారి సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ల ఏర్పాటు. 
  • రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ధరలు అమలు.  
  • నేషనల్ క్యాపిటల్ రీజియన్ తరహాలో స్టేట్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతం ఏర్పాటు చేసి హైదరాబాద్ శివార్లలో సమగ్రాభివృద్ధికి చర్యలు. 
  •  గ్రామ పంచాయతీలకు పెండింగ్‌ బిల్లులన్నీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే చెల్లింపు. 

2.    అణగారిన వర్గాల సశక్తీకరణ– అందరికీ చట్టం సమానంగా వర్తింపు  

  • వెనుకబడిన వర్గాల  ఆకాంక్షలకు అనుగుణంగా, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కల్పించేందుకు బీసీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి.

  •  మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందజేత. 
  •  ప్రత్యేకంగా బీసీ అభివృద్ధి నిధి ఏర్పాటు. అటల్ పెన్షన్ యోజన లాగే పీఎం విశ్వకర్మ యోజనలో నమోదు చేసుకున్న చేతివృత్తుల వారికి పింఛన్లు. 
  •  స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు బీసీ సీసీఐ (బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఏర్పాటుకు మద్దతు. 
  •  ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీల ఉప వర్గీకరణ, వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఎస్సీ, ఎస్టీలకు 
  • సంబంధించిన బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ.  
  • ఇండోర్ తరహాలో పారిశుధ్య కార్మికులను వేస్ట్ మేనేజ్మెంట్​లో సహ- యజమానులుగా గుర్తింపు. 
  • బీడీ కార్మికులకు సామాజిక భద్రత. 5 లక్షలమంది గిగ్ వర్కర్స్ (ఉబర్, స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ద్వారా సేవలందించేవాళ్లు)కు సాధికారత కల్పించేందుకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు. వలస వెళ్లే కార్మికులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం ‘వలస కార్మికుల సంక్షేమ బోర్డు’ ఏర్పాటు. వలస కార్మికుల కుటుంబాల్లోని మహిళలు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు రూ.లక్ష వరకు రుణాలు.  
  • తెలంగాణ అడ్వొకేట్స్ ట్రస్టుకు ఇచ్చిన రూ.100 కోట్ల నిధిని బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు బదిలీ. దీనికి అదనంగా మరో రూ.200 కోట్లు జోడించి రూ.300 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు.  
  • సింగరేణిలోని కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాతో సమానంగా జీతాల చెల్లింపు. ఆదాయపు పన్ను రీయింబర్స్ మెంట్. 
  • అటల్ వయో అభ్యుదయ్ యోజన’ కింద వృద్ధాశ్రమాల నిర్మాణం. వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్రలు. 
  • దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.25 లక్షల వరకు తక్కువ వడ్డీకే రుణాలు. 
  • రోహింగ్యాలు, అక్రమ వలసదారుల బహిష్కరణ. యాంటీ- రాడికలైజేషన్ సెల్ ల ఏర్పాటు. 
  • రాష్ట్ర వ్యాప్తంగా యునిఫామ్ సివిల్ కోడ్ అమలు కోసం కమిటీ. ప్రభుత్వ ఉద్యోగులకు బహుభార్యత్వం, బహుభర్తృత్వం నిషేధిస్తూ చట్టం.  

3. కూడు - గూడు: ఆహార, నివాస భద్రత 

  • పీఎం ఆవాస్‌ యోజన కింద పేదలందరికీ ఇండ్లు మంజూరు. అర్హులైన పేదలకు ఇంటి పట్టాల పంపిణీ. అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు. ప్రతి మూడు నెలలకోసారి కొత్త రేషన్ కార్డులు జారీ. 

4. రైతే రాజు– అన్నదాతకు అందలం 

  • కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎరువుల సబ్సిడీ (ఎకరానికి రూ.18వేలు) తో పాటుగా చిన్న, సన్నకారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునేందుకు రూ.2,500 ఇన్ పుట్ అసిస్టెన్స్. 

  • రైతులందరికీ ఉచిత పంట బీమా. 
  • వరికి రూ.3,100 మద్దతు ధర. చిరుధాన్యాలకు మద్దతు ధరకు అదనంగా బోనస్‌. 
  • నిజామాబాద్ టర్మరిక్ సిటీగా అభివృద్ధి. పసుపు రైతుల కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్.  
  •  ప్రతి జిల్లాకు ఒక సహకార డెయిరీ ఫామ్‌ ఏర్పాటు. రైతులకు దేశీ ఆవుల పంపిణీ.
  •  రాష్ట్రంలో పూల తోటల సాగును పెంచేందుకు ‘మిషన్ బతుకమ్మ’

5. నారీశక్తి – మహిళల నేతృత్వంలో అభివృద్ధి 

  • డిగ్రీ కాలేజీలు, ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే 

  • విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్‌ టాప్ లు.  
  • ఆడబిడ్డ భరోసా పేరుతో పుట్టిన ఆడపిల్లలకు ఫిక్స్ డ్ డిపాజిట్. ఆ ఆడబిడ్డ 18 ఏండ్లు వచ్చిన తర్వాత రూ.లక్ష, 21 ఏండ్ల వచ్చిన తర్వాత రూ.2 లక్షలు పొందేలా పథకం. 
  • ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఎస్​హెచ్​జీలకు 1% వడ్డీకే రుణాలు. డ్వాక్రా మహిళలకు రూ.5 లక్షల బీమా.
  • మహిళా రైతులకు సహకారం అందించేందుకు మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు. మహిళలకు నైపుణ్య శిక్షణ, సామాజిక భద్రత అందించేందుకు డొమెస్టిక్ వర్కర్స్ కార్పొరేషన్ ఏర్పాటు. 
  • ఐదేండ్లలో మహిళలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలు. 

6. యువశక్తి–ఉద్యోగ కల్పన

  •     యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో గ్రూప్-1, గ్రూప్-2 సహా టీఎస్‌పీఎస్సీ రిక్రూట్మెంట్ పరీక్షలు 6 నెలలకోసారి నిర్వహణ.  

  •     ఈడబ్ల్యూఎస్‌  కోటాతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో భర్తీ. 
  •     క్రీడల కోసం స్టేడియాల నిర్మాణం. 

కేసీఆర్ పేదల వ్యతిరేకి..

కేసీఆర్ పేదల వ్యతిరేకి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆయన కండ్ల ముందు కవిత, కేటీఆర్ మాత్రమే కనబడతారని, వారికి మేలు చేయడంపైనే ధ్యాస అని విమర్శించారు. శనివారం సాయంత్రం బీజేపీ  మేనిఫెస్టో విడుదల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ అస్తవ్యస్త పాలనతో రాష్ట్ర అప్పులు రూ.7 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో.. కాళేశ్వరం, ధరణి వంటి వివిధ కుంభకోణాల ద్వారా జరిగిన అవినీతిపై, ఆర్థిక అవకతవకలపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిటీని వేస్తం” అని చెప్పారు. లిక్కర్, గ్రానైట్, మిషన్ కాకతీయ..ఇలా ప్రతి పథకం, అభివృద్ధి పనిలో కేసీఆర్​అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. అనంతరం సుమారు అర గంట పాటు పార్టీ ముఖ్య నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, తరుణ్ చుగ్, ప్రకాశ్ జవదేకర్, పొంగులేటి సుధాకర్ రెడ్డితో అమిత్ షా భేటీ అయ్యారు. ప్రచార సరళి, ఎన్నికల్లో ఏ పార్టీ పరిస్థితి ఏంటని ఆరా తీశారు. మేనిఫెస్టో విడుదల తర్వాత సికింద్రాబాద్ లోని ఓ  ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మంద కృష్ణ మాదిగతో పాటు ఎమ్మార్పీఎస్ ముఖ్య నేతలతో అమిత్​షా సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ కట్టుబడి ఉందని, ఒకసారి మాట ఇస్తే.. అమలు చేసి తీరుతామని వారికి స్పష్టం చేశారు.

7. విద్యాశ్రీ 

  •     డీఎస్సీ నిర్వహించి, ఖాళీగా ఉన్న 20 వేల టీచర్ పోస్టుల భర్తీ. 
  •     ప్రతి మండలంలో నోడల్ స్కూల్.
  •     అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల విధానంపై పర్యవేక్షణ. బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు ఆస్తి పన్ను, విద్యుత్, నీటి బిల్లుల నుంచి మినహాయింపు.  
  •     కేంద్రప్రభుత్వం తెచ్చిన జాతీయ విద్యావిధానం అమలు. ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యకు పరిష్కారం. 
  •     యూనివర్సిటీల అభివృద్ధికి వన్‌టైమ్‌ గ్రాంట్‌. రాణి రుద్రమ మహిళా విశ్వవిద్యాలయం పటిష్టానికి చర్యలు.  
  •     రీడింగ్‌ రూమ్స్ , ఉచిత హైస్పీడ్‌ ఇంటర్నెట్, అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ కలిగిన 100 సీఎం లైబ్రరీలు ఏర్పాటు. 

8. వైద్యశ్రీ 

  • అర్హత కలిగిన కుటుంబాలకు  ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఏడాదికి రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య కవరేజీ. 

  • ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఏడాదికోసారి ఉచిత వైద్య పరీక్షలు.
  • జిల్లాకో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు. ఎయిమ్స్‌ తరహాలో ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, మెదక్ సూపర్ స్పెషాలిటీ
  •  ఆస్పత్రులు ఏర్పాటు. 
  • కార్మికుల కోసం ప్రత్యేకంగా నాలుగు ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌ నిర్మాణం. 
  • 100 కొత్త పీహెచ్ సీల ఏర్పాటు. 

9. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు

  • నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష.-
  • రాష్ట్రంలో హైవేలు, ఇన్ఫోవేలు, రైల్వేలు, ఎయిర్వేల అభివృద్ధిపై దృష్టి. 
  • ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పారిశ్రామిక కారిడార్ల పనులు వేగవంతం చేయడంతో పాటు కొత్తగా హైదరాబాద్–విజయవాడ పారిశ్రామిక కారిడార్ ప్రారంభం. 
  • కృష్ణానదిపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం.  
  • గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా, పారిశుధ్యం, ముంపు, రోడ్లు, ట్రాఫిక్ మేనేజ్ మెంట్ తదితర సమస్యలకు పరిష్కారం. 
  • విద్యుత్‌ రంగంలో స్మార్ట్ మీటర్లు. గ్రీన్‌ ఎనర్జీకి ప్రోత్సాహం. ఈవీ చార్జింగ్ వసతుల కల్పన.  

10. వారసత్వం, సంస్కృతి, చరిత్ర పరిరక్షణ 

  • సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలు అధికారికంగా నిర్వహణ.
  • మేడారం సమ్మక్క సారక్క జాతర జాతీయ స్థాయిలో నిర్వహణ.
  • నిజాం వ్యతిరేక పోరాట యోధులు, వాళ్ల త్యాగాలకు గుర్తింపుగా స్మారక చిహ్నం, మ్యూజియం నిర్మాణం. బైరాన్ పల్లి, పరకాల మారణకాండకు గుర్తుగా ఆగస్టు 27న ‘రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం’గా నిర్వహణ.
  • వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర. 
  • యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కోసం కమిటీ ఏర్పాటు.