నక్సలిజం అంతరించే పోయే దశలో.. టెర్రరిజాన్ని తరిమికొట్టినం: అమిత్ షా

నక్సలిజం అంతరించే పోయే దశలో.. టెర్రరిజాన్ని తరిమికొట్టినం: అమిత్ షా

రాయ్‌‌‌‌పూర్‌‌‌‌: దేశంలో నక్సలిజం అంతరించే పోయే దశకు చేరుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశం నుంచి టెర్రరిజాన్ని తరిమికొట్టిందని పేర్కొన్నారు. సోమవారం చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని కంకేర్ టౌన్​లో ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మిగిలి ఉన్న నక్సలైట్లు లొంగిపోవాలని, లేదంటే రెండేండ్లలో తరిమికొడతామని ఆయన హెచ్చరించారు. దేశంలో రాహుల్​ కుటుంబంలోని నాలుగు తరాలు అధికారంలో ఉన్నాయని, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని పేద ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. 

దేశంలోని వనరులపై మైనార్టీలకు మొదటి హక్కు ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తోందని.. కానీ, పేదలు, ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వారికి మొదటి హక్కు ఉందని బీజేపీ అంటోందన్నారు. పదేండ్ల ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రధాని మోదీకి 25 ఏండ్ల ఎజెండా ఉందని పేర్కొన్నారు. మహాదేవ్ యాప్ బ్రాండ్ భూపేష్ బఘేల్ ప్రభుత్వం చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో నక్సలైట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విష్ణు దేవ్ సాయి సీఎంగా, విజయ్ శర్మ రాష్ట్ర హోంమంత్రిగా గత నాలుగు నెలల్లోనే 90 మంది నక్సలైట్లను ఎన్​కౌంటర్ ​చేశారని అమిత్​ షా చెప్పారు. 

123 మంది నక్సలైట్లను అరెస్టు చేయగా.. 250 మంది లొంగిపోయారన్నారు.  ప్రధాని మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా నక్సలిజం నిర్మూలనకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. మోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకుంటే.. రెండేండ్లలో చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ నుంచి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. బీజేపీ కంకేర్‌‌‌‌ లోక్‌‌‌‌సభ స్థానం అభ్యర్థి భోజరాజ్ నాగ్‌‌‌‌కు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, కంకేర్‌‌‌‌లో ఈ నెల 26న పోలింగ్ జరగనుంది.