అమల్లోకి సీఏఏ..గెజిట్​ విడుదల చేసిన కేంద్ర హోం శాఖ

అమల్లోకి సీఏఏ..గెజిట్​ విడుదల చేసిన కేంద్ర హోం శాఖ
  • 2014 డిసెంబర్​ 31వరకు భారత్​కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం
  • ఆన్​లైన్​లోనే పౌరసత్వ దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్​ పోర్టల్​లోక్​సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : లోక్​సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నది. పౌరసత్వ సవరణ చట్టం –2019 (సీఏఏ)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం గెజిట్​విడుదల చేసింది. ఆ వెంటనే దేశమంతా సీఏఏ అమల్లోకి వచ్చింది. మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్​ 31 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్​ నుంచి భారత్​కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు లైన్​ క్లియర్​ అయింది. వీరికి పౌరసత్వం కల్పించేలా 2019 డిసెంబర్​లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య మోదీ సర్కారు పార్లమెంట్​లో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి కూడా సమ్మతి తెలిపారు. అయితే, సీఏఏను వ్యతిరేకిస్తూ అప్పట్లో దేశవ్యాప్తంగా ఘర్షణలు చెలరేగాయి. బీజేపేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా చేశాయి. 

ఈ ఆందోళనల్లో దాదాపు వందమందిదాకా మృతిచెందారు. అయితే , పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం ఇప్పటివరకూ అమల్లోకి రాలేదు. లోక్​సభ ఎన్నికలముందే సీఏఏను అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్​ షా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీంతో బిల్లు పాసయ్యాక నాలుగేండ్లకు సీఏఏకు వాస్తవరూపం వచ్చినట్టయింది. కాగా, సీఏఏను నోటిఫై చేయడంతో ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఆన్​లైన్​ మోడ్​లో పౌరసత్వ దరఖాస్తులు

సీఏఏ అమలుకు కేంద్రం గెజిట్​ విడుదల చేయడంతో 2014 కంటే ముందు భారత్​కు వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం లభించనున్నది. అర్హత ఉన్నవారు పౌరసత్వం కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఇందుకోసం వెబ్​ పోర్టల్​ను కూడా సిద్ధం చేసినట్టు చెప్పారు. దరఖాస్తుదారుల దగ్గర ఇతర డాక్యుమెంట్టు ఏవీ అడగబోమని వెల్లడించారు.

నిబద్ధత చాటిన మోదీ: అమిత్​ షా

సీఏఏ అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్​తో ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన నిబద్ధత చాటుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఎక్స్​ వేదికగా పేర్కొన్నారు. హింసకు గురవుతున్న మైనార్టీలకు మన దేశంలో పౌరసత్వం లభించనున్నదని తెలిపారు. ​ఆయా దేశాల్లో నివసిస్తున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు మన దేశ రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన వాగ్దానాన్ని మోదీ నెరవేర్చారని షా వ్యాఖ్యానించారు.

కాగా, కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్​సహా ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి. బెంగాల్​, అస్సాంలో రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే సీఏఏను అమల్లోకి తెచ్చారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఎలక్టోరల్​ బాండ్లపై సుప్రీం తీర్పు వార్తను కనుమరుగు చేసేందుకే సీఏఏ అమలు నిర్ణయమని కాంగ్రెస్​ నేత జైరాం రమేశ్​ విమర్శించారు. సీఏఏను మత విభజన చట్టంగా అభివర్ణించిన కేరళ సీఎం పినరయి విజయన్​.. తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం–2019 అమలును వ్యతిరేకిస్తామని బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.

ఏమిటీ చట్టం?

  • ఈ పౌరసత్వ సవరణ బిల్లును మొదటిసారి 2016 జూలైలో పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. అప్పుడు లోక్​సభలో ఆమోదం పొందింది.
  • ప్రతిపక్షాల నిరసనల మధ్య 2019 డిసెంబర్​ 11న ఈ బిల్లు పార్లమెంట్​లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి లభించింది.
  • పాకిస్తాన్​, అఫ్గానిస్తాన్​, బంగ్లాదేశ్​లో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి 
  • వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్​ 
  • మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం సీఏఏ లక్ష్యం.
  • 64 ఏండ్ల కిందటి భారత పౌరసత్వ చట్టం –1955ను ఇది సవరించింది.
  • భారత పౌరసత్వం పొందేందుకు దేశంలో 11 ఏండ్లపాటు నివసించడంకానీ.. పనిచేసి ఉండాలనే నిబంధనలను సవరించింది. 
  • సీఏఏ ప్రకారం పాకిస్తాన్​, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్​కు చెందిన ముస్లిమేతర శరణార్థులు పౌరసత్వం పొందాలంటే ఆరేండ్లపాటు దేశంలో నివసించడం లేదా పనిచేసి ఉండాలి.ఇందులో ముస్లింలను చేర్చకపోవడం వివాదానికి కారణమైంది.
  • ఇది రాజ్యాంగంలోని మానవులకు సమాన హక్కులు కల్పించే ఆర్టికల్​ 14ను ఉల్లంఘించడమేని ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి.