విభజన సమస్యలపై 23న కేంద్రం కీలక సమావేశం

విభజన సమస్యలపై 23న కేంద్రం కీలక సమావేశం

ఢిల్లీ : విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న  సమావేశం జరగనుంది. దీనిపై ఏపీ, తెలంగాణ అధికారులకు కేంద్రం సమాచారాన్ని అందజేసింది. 23వ తేదీన జరిగే సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. ఈసారి జరిగే భేటీలో విభజన సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, లోటు భర్తీ, అమరావతికి నిధులు తదితర అంశాలను సమావేశ ఎజెండాలో చేర్చినట్లు సమాచారం.

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో వివిధ కేంద్ర శాఖల కార్యదర్శులు కూడా పాల్గొననున్నారు. కాగా, ఇటీవల జరిగిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ సాధ్యం కాదని రైల్వేశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. 

సెప్టెంబరు 27న జరిగిన  సమావేశంలో..

చివరగా సెప్టెంబరు 27న జరిగిన  సమావేశ ఎజెండాలో మొత్తం 14 అంశాలు ఉండగా, ఏడింటిపై చర్చించారు.  ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, చట్టంలో లేని ఇతర సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనపై చర్చ జరిగింది. సింగరేణి కాలరీస్ ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్ విభజన, AP SCSCL, TSSL క్యాష్ క్రెడిట్, 2014- 15  రైస్ సబ్సిడీ విడుదల అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటివరకు దాదాపు 26 సమావేశాలు జరిగాయి.