
గువాహటి: కాంగ్రెస్ పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మండిపడ్డారు. బిహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై కాంగ్రెస్ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. దీనికి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అస్సాం టూర్‌లో భాగంగా అమిత్ షా శుక్రవారం గువాహటిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ద్వేషపూరితమైన రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ నేతలు గతంలోనూ పలుసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు ప్రధాని మోదీ, మరణించిన ఆయన తల్లిపై కూడా కామెంట్లు చేసి.. అన్ని లిమిట్స్‌ను దాటారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలను దేశం మొత్తం చూస్తున్నది. రాహుల్ గాంధీ వెంటనే ప్రధాని మోదీకి, ఆయన తల్లికి, యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలి” అని డిమాండ్ చేశారు. చొరబాటుదారులను కాపాడేందుకే బిహార్‌లో రాహుల్ యాత్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు.