కారు దిగి, బస్సును తోసిన కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్

కారు దిగి, బస్సును తోసిన కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్
  • నడి రోడ్డుపైనే ఆగిపోవడంతో ప్రయాణికులకు అనురాగ్​ ఠాకూర్​ సాయం
  • హిమాచల్​ ఎన్నికల ప్రచారానికి పోయొస్తుండగా ఘటన

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో మంగళవారం సాయంత్రం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై బ్రేక్ డౌన్ అయిన బస్సును ప్రయాణికులతో కలిసి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పక్కకు నెట్టారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిలాస్‌‌పూర్‌‌ నియోజకవర్గంలో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి కేంద్ర మంత్రి వెళ్లారు. సాయంత్రం బహిరంగ సభ ముగించుకుని తిరిగి వస్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో నిలిచిన వాహనాల మధ్య మంత్రి కాన్వాయ్​ చిక్కుకుపోయింది. 

దీంతో ట్రాఫిక్​ ఎందుకు ఆగిందని విచారించిన అనురాగ్​ ఠాకూర్.. బ్రేక్​ డౌన్​ అయిన బస్సును పక్కకు తోసేందుకు మంత్రి కూడా సాయం చేశారు. వెంటనే తన కారు దిగి అక్కడున్న వారితో కలిసి బస్సును తోశారు. అనంతరం బస్సు డ్రైవర్‌‌, ప్రయాణికులతో కాసేపు మాట్లాడి వారి క్షేమసమాచారం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో మరోసారి బీజేపీకి అవకాశమివ్వాలని వారిని కోరారు. బీజేపీకే  ఓటేయాలని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేంద్ర మంత్రి బస్సును నెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది.