అసాంఘిక శక్తులు చేరినయ్ జాగ్రత్త! : అర్జున్ ముండా

అసాంఘిక శక్తులు చేరినయ్ జాగ్రత్త!  :  అర్జున్ ముండా

న్యూఢిల్లీ: రైతుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా చెప్పారు. చర్చించి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటే రైతులు ముందుకు రావడంలేదన్నారు. రైతుల ఆందోళనలో కొన్ని అసాంఘిక శక్తులు చేరాయని, రైతులకు చెడ్డపేరు తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని చెప్పారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని రైతులను మంత్రి హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆందోళనకర పరిస్థితిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి సంప్రదింపులు జరపకుండా తొందరపడి ఎంఎస్పీ చట్టాన్ని తీసుకురాలేమని అర్జున్​ముండా స్పష్టం చేశారు. 

మంగళవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ‘‘ఇప్పటికే రైతు సంఘాలతో మంత్రుల బృందం రెండు రౌండ్ల చర్చలు జరిపింది. ఇందులో మేము వారి అనేక డిమాండ్లను అంగీకరించాం. కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిపాలనా స్థాయిలో చేయగలిగే అనేక డిమాండ్లను నెరవేర్చడానికి కేంద్రం అంగీకరించింది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయంలో ఎలాంటి చట్టాన్ని తీసుకురావాలి? తెచ్చే చట్టం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటి అనేది చూడాలి. ఒక సమగ్ర విధానం కోసం దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సహా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది” అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా చెప్పారు.