పాట్నాలో కేంద్ర మంత్రి చౌబేపై ఇంకు దాడి

పాట్నాలో కేంద్ర మంత్రి చౌబేపై ఇంకు దాడి

పాట్నా: కేంద్ర మంత్రి అశ్విన్ చౌబేపై బీహార్​లో ఇంకు దాడి జరిగింది. మంగళవారం పాట్నాలోని మెడికల్ కాలేజీ  హాస్పిటల్​ దగ్గర ఈ ఘటన జరిగింది. హాస్పిటల్ లో​ డెంగీ పేషెంట్లను పరామర్శించి బయటికి వస్తుండగా ఆయనపై నలుపు, నీలం ఇంకు చల్లారు. ఆయన వేసుకున్న జాకెట్​పై కొంత, కారుపై కొంత ఇంకు పడింది. మాజీ  ఎమ్మెల్యే పప్పు యాదవ్​కు చెందిన జన్ అధికార్ పార్టీ కార్యకర్త ఈ దాడి చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై చౌబే స్పందిస్తూ.. ప్రజలపై, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు. ‘‘ఇంకును జర్నలిస్టులపైకి చల్లారు. అందులో కొంత నాపైకి పడింది. దీని వెనుక కొందరు క్రిమినల్స్ ఉన్నారు. పొలిటికల్ లీడర్లుగా మారాలని వారు అనుకుంటున్నారు” అని అంటూ ఆయన కారులో ఎక్కి వెళ్లిపోయారు. ఆయన వెళ్తున్న సమయంలో ‘ఎక్కడా నీళ్లు లేవు’ అంటూ ఓ వ్యక్తి అరిచాడు. రాజకీయ నేతలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు నిరసనకారులు ఇంక్‌‌ చల్లడం ఇదే మొదటిసారి కాదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‌పై ఇంతకుముందు రెండుసార్లు ఇంక్ దాడి జరిగింది. ఓ సారి కారంపొడి కూడా ఆయనపై చల్లారు.