
- పార్టీ కార్యకర్తలకు కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతున్నారని, బీజేపీ కార్యకర్తలు ఇంటికి పరిమితం కాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల్లో నిమగ్నం కావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్ లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండలాధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ మేయర్ సునీల్ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల సమయంలో బాధితులను ఆదుకునేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని, హెలికాప్టర్లను, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షులు తమ పరిధిలోని గణేశ్ మండపాలను సందర్శించి కరెంట్, ఇతరత్రా ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. సంజయ్ గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కరీంనగర్ లోని పలు గణేశ్ మండపాలను సందర్శించి పూజలు నిర్వహించారు.
మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు
కరీంనగర్ సిటీ, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లోని కోర్టు చౌరస్తా వద్ద 15 మంది నిరుపేద మహిళలకు గురువారం ఎలక్ట్రిక్ ఆటోలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ ఇంట్లోనైతే మహిళలకు ఇంటి తాళం అప్పగిస్తారో ఆ ఇల్లు బాగుపడుతుందన్నారు.