బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులు చేస్తోంది

బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులు చేస్తోంది
  • యూపీ తరహాలో ఇక్కడా అంతం చేస్తం: కేంద్రమంత్రి బీఎల్ వర్మ 
  • సీఎం కేసీఆర్ ఎన్నో హామీలిచ్చి ప్రజలను మోసం చేసిండు 
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమా

హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్ గూండా రాజకీయాలు చేస్తోందని, బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగుతోందని కేంద్రమంత్రి బీఎల్ వర్మ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ తరహాలో తెలంగాణలోనూ గూండా రాజకీయాలను అంతం చేసి, ప్రజలకు సుపరిపాలన అందజేస్తామని చెప్పారు. ‘‘పార్లమెంట్ ప్రవాస్ యోజన”లో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించేందుకు బీఎల్ వర్మ రాష్ట్రానికి వచ్చారు. 

శుక్రవారం ఓరుగల్లుకు వచ్చిన ఆయనకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్​సెంటర్​ను బీఎల్ వర్మ పరిశీలించారు. ఆ తర్వాత నక్కలగుట్టలోని హరిత హోటల్​లో మీడియాతో మాట్లాడారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. ఒక్కటన్నా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, పేదలకు ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నిధులు ఇస్తుంటే.. కేసీఆర్ వాటిని ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్​భారత్​ పథకంలో చేరకుండా పేదలకు వైద్య సదుపాయాలను దూరం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్​కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ హయాంలో స్కామ్ లు... 

కేంద్రంలో కాంగ్రెస్ హయాంలో రూ.లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని బీఎల్ వర్మ ఆరోపించారు. మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతోందని చెప్పారు. జన్ ధన్ ఖాతాలు అందించి వివిధ పథకాల ద్వారా నగదు జమ చేస్తోందని తెలిపారు. కిసాన్ ​సమ్మాన్​ నిధి కింద రూ.లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. కరోనా కట్టడికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని, తమ ప్రభుత్వ కృషి వల్లే వ్యాక్సిన్​జనాలందరికీ చేరిందన్నారు. లాక్​డౌన్​ సమయంలో దేశంలోని దాదాపు 80 కోట్ల కుటుంబాలకు ఫ్రీ రేషన్ ఇచ్చిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. మీడియా సమావేశం అనంతరం లోక్ సభ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాల్లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్ ​తదితరులు పాల్గొన్నారు.