
ఆసిఫాబాద్, వెలుగు: దేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని మోదీ నాయకత్వంలో 117 ఆస్పిరేషన్ బ్లాక్స్ ను ఏర్పాటు చేశామని కేంద్ర కార్పొరేట్వ్యవహారాల శాఖ సహయ మంత్రి హర్ష్ మల్హోత్రా తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన లైబ్రరీ, ఇందిరమ్మ మోడల్ హౌజ్, తుంపెల్లిలో జల్ జీవన్ మిషన్ ట్యాంక్ ను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. వెనకబడిన ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు. మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజన ప్రజలకు మెడికల్ ఫెసిలిటీ కూడా మెరుగుకు కృషి చేస్తున్నామన్నారు.
అధికారులు సమన్వయంతో పని చేసి అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 49పై స్పందిస్తూ సమగ్రంగా స్టడీ చేసి కేంద్రం ఏమి చేయగలదో చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, హరీశ్ బాబు, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్ తదితరులు పాల్గొన్నారు.